Brij Bhushan : అమ్మాయిల పల్స్ రేటు చూసానే తప్ప, తప్పుగా ప్రవర్తించలేదన్న బ్రిజ్ భూషణ్

Brij Bhushan : అమ్మాయిల పల్స్ రేటు చూసానే తప్ప,  తప్పుగా ప్రవర్తించలేదన్న  బ్రిజ్ భూషణ్
తదుపరి వాదనలను ఈ నెల 19కి వాయిదా

అమ్మాయిలపై తనకి తప్పుడు ఉద్దేశాలు లేవని కోర్టుకు తెలిపారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. మరో ఉద్దేశమేమీ లేకుండా వారి పల్స్ రేటు చూడడం తప్ప తానేమీ చేయలేదన్నారు. మహిళా రెజ్లర్లను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యాయవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో న్యాయవాది భూషణ్ శరణ్ సింగ్ తరఫున తమ వాదనలు వినిపించారు. బ్రిజ్ భూషణ్ పై ఉన్న ఆరోపణలకు ఆధారాలు ఏవీ లేవని చెప్పారు. మహిళా రెజ్లర్ల పల్స్ ను మాత్రమే బ్రిజ్ భూషణ్ చెక్ చేసేవారని తెలిపారు.

అయితే బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టుకు పోలీసులు తెలిపారు. అదేవిధంగా మహిళా రెజ్లర్ల ఆరోపణలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదనే విషయాన్ని పోలీసులు కోర్టులో ప్రస్తావించారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీ కోర్టుకు నివేదిక సమర్పించారు.


ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్‌ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్‌ భూషణ్‌ తన గదికి పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రిలా తాను ఈ ఇలా చేశానని చెప్పాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక అనుమతి లేకుండా తన చొక్కాను బ్రిజ్‌ భూషణ్‌ పైకి ఎత్తాడని మరో మహిళా రెజ్లర్‌ ఫిర్యాదు చేసిందని, ఈ రెండు ఘటనలు బ్రిజ్‌భూషణ్‌ ఉద్దేశపూర్వకంగానే ఆ పనులు చేశాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.

కాగా, కొన్ని నెలల క్రితం బ్రిజ్‌ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్‌తో పాటు ఏడుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మైనర్‌ రెజ్లర్‌ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నది. వాదనలు విన్న న్యూ ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తదుపరి వాదనలను ఈ నెల 19కి వాయిదా వేశారు.

Tags

Next Story