Sonia Gandhi: సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే, అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు పంపింది.
వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 1983 ఏప్రిల్‌లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం లభించగా, అంతకుముందే 1980లో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చారని పిటిషనర్ ఆరోపించారు. ఫోర్జరీ, తప్పుడు పత్రాలు సమర్పించడం వల్లే ఇది సాధ్యమైందని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెప్టెంబర్ 11న కొట్టివేసింది.
కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ త్రిపాఠి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను 2026 జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.
గతంలో మెజిస్ట్రేట్ కోర్టు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల సంబంధిత అంశాలలో న్యాయస్థానాల జోక్యం పరిమితంగా ఉంటుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే, ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కాదని, ఫోర్జరీ వంటి క్రిమినల్ నేరానికి సంబంధించినదని పిటిషనర్ వాదిస్తున్నారు. ఈ అంశం గతంలో రాజకీయంగానూ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

