Atishi: ఎన్నికల వేళ సీఎం ఆతిశీకి ఊరట, పరువు నష్టం కేసు కొట్టివేత

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి అతిషికి భారీ ఊరట లభించింది. అతిషిపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పురువు నష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అతిషి చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థి పార్టీని ఉద్దేశించి చేసినవే కానీ, నిర్దిష్ట వ్యక్తులను ఉద్దేశించి చేసినవి కావని న్యాయస్థానం తెలిపింది.
తమ పార్టీలో చేరాలంటూ బీజేపీకి చెందిన కొందరు నేతలు సంప్రదించినట్లు గత ఏడాది ఏప్రిల్‌లో అతిషి ఆరోపించారు. బీజేపీలో చేరాలని.. లేదంటే ఈడీ అరెస్ట్ ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. అతిషి ఆరోపణలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీపై అతిషి తప్పుడు ఆరోపణలు చేశారని, తగిన సాక్ష్యాలు చూపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా విచారించిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఎన్నికల వేళ అతిషికి ఉపశమనం లభించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక ముఖ్యమంత్రి అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com