Delhi Liquor Scam Case: మద్యం కేసులో ముఖ్యుడు ఆయనే- ఈడీ

డిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రివాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టు.. ఆరు రోజులు కస్టడీ విధించింది. ఈ కేసులో... కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని, ఆయన నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కేజ్రివాల్ ను కస్టడీకి అనుమతించింది. సీసీ కెమెరాల ముందే ప్రశ్నించాలని, ప్రతిరోజు నిర్దేశిత సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలుసుకునేందుకు అనుమతించాలని తెలిపింది.
డిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. భయపడిన ఓ నియంతప్రజాస్వామ్యాన్ని చంపేయాలని చూస్తున్నారని..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి, పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ, కంపెనీల నుంచి డబ్బు వసూలుచేస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాను స్తంభింపజేయటం వంటి చర్యలకుపాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని దీనికి ఇండియా కూటమి తగిన సమాధానం చెబుతుందని ఎక్స్‌లో పోస్టు చేశారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు. దశాబ్దం పాటు వైఫల్యాలకు తోడ ఓటమి భయంతోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని విమర్శించారు. ఫాసిస్టు విధానాలతో భాజపా అగాధంలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్టు అభ్యంతరకరమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. విపక్షాల గొంతు నొక్కేందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో భాజపా 3 లైన్ల అజెండా నిరూపితమైందని అన్నాడీఎంకే పేర్కొంది. తమను వ్యతిరేకించిన వారు జైలు నుంచి పోటీ చేయడం, పార్టీ నిధులు వాడుకోకుండా చూడటమే భాజపా అజెండా అని ఆరోపించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారితోనూ పొత్తుకు భాజపా వెనుకాడదని విమర్శించింది. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. భాజపా నైరాశ్యం పూర్తిగా కనపడుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా విమర్శించారు.400 సీట్లు గెలవలేమని తెలిసే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ప్రతీకారమే భాజపా ఏకైక లక్ష్యమని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com