Delhi: ఢిల్లీని హడలెత్తించిన వడగండ్ల వాన

భారీ తుఫాన్ దేశ రాజధాని ఢిల్లీని హడలెత్తించింది. బుధవారం సృష్టించిన విలయానికి నగరం అతలాకుతలం అయింది. దుమ్ము, ఈదురుగాలులతో కూడిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా ఢిల్లీ, నోయిడాలో చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్‌లు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. ఇక బీభత్సమైన వడగండ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తుఫాన్ ధాటికి దేశ రాజధాని అల్లకల్లోలం అయిపోయింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అకస్మాత్తుగా తీవ్రమైన వడగళ్ల వాన, తీవ్రమైన వర్షం, బలమైన ఈదురుగాలులు, దుమ్ము తుఫానుతో బెంబేలెత్తించేసింది. నగర వాసులంతా హడలెత్తిపోయారు. ఇక చెట్లు కూలిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంధకారంలోనే ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే మెట్రో సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం నలుగురు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. లోధి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి హైవోల్టేజ్ వైర్ మీద పడి మరణించాడు. గోకుల్‌పురిలో మౌజ్‌పూర్‌కు చెందిన యువకుడు (22) అజర్‌పై చెట్టు పడి చనిపోయాడు. ఘజియాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న 40 ఏళ్ల ముజామిల్‌పై చెట్టు పడి మృతిచెందాడు. అలాగే పాఠశాల గోడ కూలి 38 ఏళ్ల మహిళ చనిపోయింది.
ఇక ఈదురుగాలులకు విమానాలు కూడా దెబ్బతిన్నాయి. పన్నెండు విమానాలు జైపూర్‌కు. ఒకటి ముంబైకు మళ్లించారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముక్కు భారీగా దెబ్బతింది. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో అరుపులు, కేకలు వేశారు. పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో పలువురు ఎంపీలు ఉన్నారు. వారంతా ప్రాణభయంతో బయటపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com