Marital Rape: దాంపత్య అత్యాచారం నేరమా? కాదా?.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై భిన్న అభిప్రాయాలు..

Marital Rape: దాంపత్య అత్యాచారం నేరమా? కాదా?.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై భిన్న అభిప్రాయాలు..
Marital Rape: దాంపత్య అత్యాచారం.. నేరమా..? కాదా..? ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ఎటూ తేల్చలేకపోయింది.

Marital Rape: దాంపత్య అత్యాచారం.. నేరమా..? కాదా..? ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ఎటూ తేల్చలేకపోయింది. ఐపీసీ-375 సెక్షన్‌ కింద రేప్‌ నిర్వచనం నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించడంలో రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో జడ్జీలు పరస్పరం భిన్నమైన తీర్పునిచ్చారు. మారిటల్‌ రేప్‌ కూడా లైంగిక దాడే అని, శిక్షార్హమైనదేనని ఒక జడ్జి తీర్పునివ్వగా.. మారిటల్‌ రేప్‌ నేరంగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమైనదేమీ కాదని మరో జడ్జి తీర్పునిచ్చారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసుకోవాలని ఇద్దరు న్యాయమూర్తులు పిటిషనర్లకు సూచించారు.

డివిజన్‌ బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్‌ రాజీవ్‌ షక్దేర్‌.. మారిటల్‌ రేప్‌కు ఉన్న మినహాయింపును తొలగించాలని.. ఇది శిక్షార్హమైనదని అన్నారు. స్వేచ్ఛ, జీవించే హక్కును ఇది హరిస్తుందని తీర్పునిచ్చారు. దీనికి భిన్నంగా మరో జడ్జి జస్టిస్‌ హరిశంకర్‌ వైవాహిక అత్యాచారానికి మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమైనదేమీ కాదని అన్నారు. దీన్ని నేరంగా పరిగణించలేమని.. అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరత్వానికి లోనవుతుందని కేంద్రం 2017లో ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించిందని పేర్కొనడం పిటిషనర్లను విస్మనియానికి గురి చేసింది.

IPC సెక్షన్ 375 ప్రకారం అత్యాచారం నేరం. ఈ సెక్షన్‌కు రెండో మినహాయింపు ప్రకారం భార్యతో భర్త బలవంతంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరం కాదు. భార్యకు ఇష్టంలేని సమయంలో ఆమెతో దాంపత్యంలో పాల్గొన్న భర్తకు అత్యాచార నేరం నుంచి మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ రాజీవ్ షక్దర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఆయనతో తాను ఏకీభవించలేనని జస్టిస్ హరి శంకర్ చెప్పారు. ఈ అంశంలో ప్రధానమైన శాసన ప్రశ్నలు ఇమిడి ఉన్నాయని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయవచ్చునని ఈ ఇద్దరు న్యాయమూర్తులు సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు.

ఆర్టీఐ ఫౌండేషన్‌, ఆలిండియా డెమొక్రాటిక్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ ఈ పిటిషన్లను దాఖలు చేశాయి. పిటిషనర్ల వాదన ప్రకారం వివాహిత మహిళపై ఆమె భర్త లైంగిక దాడి చేసినపుడు, ఆ మహిళ పట్ల వివక్షకు ఈ సెక్షన్‌లోని మినహాయింపు నిబంధన దోహదపడుతోంది. అందువల్ల ఈ నిబంధన రాజ్యాంగబద్ధమైనది కాదని.. ఈ మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లు వేశారు. దీనిపై విస్తృత స్థాయిలో వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు.. ఫిబ్రవరి 21న తీర్పును రిజర్వు చేసింది. గర్ల్ ఫ్రెండ్ లేదా సహజీవనం చేసే భాగస్వామి అంగీకారం తెలియజేయనపుడు, ఆమెతో బలవంతంగా దాంపత్యం చేయడం నేరమని జస్టిస్ షక్దర్ చెప్పారు.

వారి మధ్య ఉండే బాంధవ్యం దీనిని ప్రత్యేక స్థాయిలో ఉంచబోదన్నారు. మహిళ అంటే మహిళేనని వ్యాఖ్యానించారు. అయితే జస్టిస్ హరిశంకర్ మాత్రం ఒకరినొకరు పెళ్లి చేసుకున్నవారికి, వివాహం చేసుకొననివారికి మధ్య ఉండే ప్రామాణిక వ్యత్యాసాన్ని వివరించారు. లైంగిక సంబంధాలను ఆశించే హక్కు వివాహం చేసుకున్న ఇరు పక్షాలకు ఉందన్నారు. కానీ అలాంటి హక్కు పెళ్లి చేసుకోనివారికి లేదన్నారు. కోర్టు నియమించిన అమికస్ క్యూరీ తీరును కూడా తప్పుబట్టారు. భార్య సమ్మతి తెలియజేయాలని మితిమీరి ఎందుకు నొక్కివక్కాణిస్తున్నారని ప్రశ్నించారు.

మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరిలో రెండు వారాల గడువు ఇచ్చింది. అయితే ఈ విచారణను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం.. కోర్టును కోరింది. దీనిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దీనికి సంబంధించి ఓ లేఖను రాసినట్లు తెలిపింది. ఈ అంశంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించే వరకు విచారణను నిలిపేయాలని కోరింది. అందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు. నిన్న మరోసారి విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం.. భిన్నాభిప్రాలు వ్యక్తం చేస్తూ తీర్పు నిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story