Property Rights: కుమారుడిని వద్దనుకున్నా.. కోడలికి నివసించే హక్కు

ఒకసారి పెళ్లి అయిన అత్తారింటికి వచ్చిన కోడలు ఏ ఇంట్లో అయితే కాపురం చేస్తుందో.. అందులో ఆమెకు నివసించే హక్కు ఎప్పటికీ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. కుమారుడితో తమకు సంబధం లేదని తల్లిదండ్రులు చెప్పినా, అతడిని ఇంట్లోంచి వెళ్లగొట్టినా కోడల్ని మాత్రం ఇంట్లోంచి బయటకు పంపించడం కుదరదని పేర్కొంటూ.. అత్తా, మామలు వేసిన ఓ పిటిషన్‌ను కొట్టివేసింది.
అసలేం జరిగిందంటే?
2010లో పిటిషనర్ల కుమారుడితో ఓ మహిళకు వివాహం జరిగింది. అయితే పెళ్లైన తర్వాత అత్తారింటికి వచ్చిన ఆమె.. అత్తమామలతో కలిసుంటూనే భర్తతో కాపురం చేసింది. కానీ 2011లో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈక్రమంలోనే వీరిద్దరూ ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఒకరు సివిల్ కేసు పెడితే, మరొకరు క్రిమినల్ కేసు వేశారు. ఆ తర్వాతే కుమారుడితో తమకు సంబంధం లేదని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు. అంతటితో ఆగకుండా అతడిని ఇంట్లోంచి పంపించి వేశారు. కోడల్ని కూడా వెళ్లిపోవాలని గొడవ పెట్టారు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు.
తాను ఆ ఇంట్లోంచి అస్సలే బయటకు కదలని వివరించింది. కానీ అత్తామామలు మాత్రం.. ఇల్లు తాము సొంతంగా సంపాదించిన ఆస్తి అని పేర్కొన్నారు. కాబట్టి అది గృహహింస చట్టంలోని ఉమ్మడి నివాసం నిర్వచనం కిందకు రాదని.. ఆ ఇల్లు తమకు మాత్రమే సొంతమని చెప్పారు. కోడల్ని తమ ఇంట్లోంచి ఎలాగైనా బయటకు పంపించమని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడే విచారణ జరిపిన న్యాయస్థానం వారికి షాక్ ఇచ్చింది. కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయినా, మీరే వద్దనుకుని అతడిని పంపించి వేసినా.. కోడలు కాపురం చేసిన ఇంటిపై ఆమెకు సర్వ హక్కులు ఉటాయని స్పష్టం చేసింది.
అత్తామామలు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుబడుతూ.. వారు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. భర్తతో గొడవలు జరుగుతున్న క్రమంలో.. మహిళకు ఆశ్రయం కల్పించకుండా, ఆమెను రోడ్డున పడేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని అభిప్రాయపడింది. ఆస్తికి అత్తమామలే యజమానులు అయినప్పటికీ.. కోడలిపై ఎలాంటి గృహ హింస జరగకుండా చూసుకునే బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని న్యాయస్థానం గుర్తు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com