Delhi High Court: బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్

యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఇటీవల పతంజలి గులాబీ షర్బత్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోను రాందేవ్ విడుదల చేశారు. అందులో కంపెనీ పేరు ప్రస్తావించకుండా ప్రముఖ స్క్వాష్ పానీయం రూహ్ అఫ్జాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీ షర్బత్ అమ్మడం వల్ల వచ్చే డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి ఉపయోగిస్తుందన్నారు. అదే పతంజలి గులాబీ షర్బత్ తాగితే గురుకులాలు, విశ్వవిద్యాలయాలు నిర్మించడానికి ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. లవ్ జిహాద్, ఓటు జిహాద్ లాగానే ప్రస్తుతం షర్బత్ జిహాద్ కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వీడియో తీవ్ర వివాదంగా మారింది. రూహ్ అఫ్జా తయారీదారు హమ్‌దార్డ్ కోర్టును ఆశ్రయించారు. రాందేవ్ చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు. దీంతో మంగళవారం పిటిషన్ విచారణకు వచ్చింది. హమ్‌దార్ద్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇది రూహ్ అఫ్జా ఉత్పత్తిని అగౌరవపరచడమే కాకుండా.. చాలా దిగ్భ్రాంతికరమైన కేసు అని.. అంతేకాకుండా ఇది మత విభజనకు కూడా దారితీస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగం లాంటివని ఆయన అన్నారు. రాందేవ్.. ఇతర ఉత్పత్తిని తక్కువ చేసి చెప్పకుండా పతంజలి ఉత్పత్తులను అమ్మగలరా? అని రోహత్గి ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా రాందేవ్, అతని సహాయకుడు బాలకృష్ణ కూడా ఇలాంటి చర్యలకే పాల్పడ్డారని.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చర్యలను గుర్తుచేశారు. విశేషమేంటంటే అప్పుడు పతంజలి తరపున వాదనలు వినిపించింది రోహత్గి కావడం విశేషం.
ఇక రాందేవ్ తరపున ప్రధాన న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో ప్రాక్సీ న్యాయవాది హాజరయ్యారు. అయితే మధ్యాహ్నం ప్రధాన న్యాయవాది హాజరు కావాలని జస్టిస్ బన్సాల్ ఆదేశించారు. లేకుంటే చర్యగా తీవ్రంగా ఉంటుందని సూచించారు. అనంతరం న్యాయవాది రాజీవ్ నాయర్ కోర్టుకు హాజరై హమ్‌దార్డ్ ఉత్పత్తికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అయితే సోషల్ మీడియా నుంచి వీడియోలు తొలగిస్తున్నట్లు హామీ ఇవ్వాలని ధర్మాసనం కోరింది. వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. విచారణను మే 1కి న్యాయస్థానం వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com