Justice Varma: జస్టిస్ వర్మ బదిలీను అలహాబాద్‌కు పంపుతూ కొలీజియం నిర్ణయం

అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జస్టిస్ యశ్వంత్ వర్మను దిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఈ నెల 20, 24వ తేదీల్లో సమావేశమైన కొలీజియం నిర్ణయం తీసుకుంది’ అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ తీర్మానాన్ని తన వెబ్‌సైట్లో పెట్టింది.
కేంద్రం ఆమోదించాక జస్టిస్ వర్మ బదిలీ అమల్లోకి వస్తుంది. మరోవైపు దిల్లీ హైకోర్టు.. జస్టిస్ వర్మను విధులకు దూరం పెట్టింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ వెలువరించిన ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సోమవారం కోర్టు ఒక నోటీసును విడుదల చేసింది.
జస్టిస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం చూడాల్సిన కేసులను జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్‌ల ధర్మాసనానికి అప్పగించారు. జస్టిస్ వర్మ నేతృత్వం వహించిన 3వ డివిజన్ బెంచ్‌ను జస్టిస్ ప్రతిభ ఎం సింగ్‌కు అప్పగించారు. అలహాబాద్ హైకోర్టుకు వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసించింది. మంగళవారం నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ వెల్లడించారు.
తాజా వివాదంపై సోమవారం రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సమావేశం నిర్వహించారు. సీజేఐ నియమించిన కమిటీ విచారణ నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో స్పందిద్దామని నిర్ణయించారు. ఈ ఘటన విషయంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించిన తీరును ధన్‌ఖడ్ ప్రశంసించారు.
చర్యలకు ప్రతిపక్ష ఎంపీల డిమాండ్: ఈ ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలనిప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సీజేఐ ఏర్పాటు చేసిన విచారణ కమిటీని ఆహ్వానిస్తున్నామని, దీనిపై పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిమాండు చేశారు. ప్రజల్లో న్యాయ వ్యవస్థపట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ సందోష్ కుమార్ కోరారు.
సుప్రీంలో పిల్: న్యాయమూర్తి ఇంట్లో నగదు లభ్యమయ్యాయన్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా దిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతోపాటు న్యాయమూర్తులకు క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ 1991లో ఇచ్చిన తీర్పునూ సమీక్షించాలని కోరుతూ న్యాయవాది మాథ్యూ జె నెడుంపరతోపాటు మరో ముగ్గురు పిల్ వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com