Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. కేజ్రీవాల్, మనీశ్ లకు భారీ ఊరట.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో జైలుపాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ, చివరకు సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు.
ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మరియు మనీశ్ సిసోడియా మధ్య ఎలాంటి కుట్ర జరగలేదని, సీబీఐ సమర్పించిన సాక్ష్యాల్లో పస లేదని కోర్టు తేల్చిచెప్పింది. "కేవలం అనుమానాలతో తీవ్రమైన ఆరోపణలు చేయలేరు.. ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటించడంతో, ఆయనపై ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
కోర్టు వెలుపల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనను జైలు గోడలు భయపెట్టలేకపోయాయని, కానీ న్యాయం జరిగినప్పుడు కలిగే ఆనందం కన్నీళ్ల రూపంలో వచ్చిందని చెప్పారు. ‘‘నన్ను జైలుకు పంపడం ద్వారా ఆప్ ను అంతం చేయాలని చూశారు. కానీ ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వారి కుట్రలు పటాపంచలు అయ్యాయి’’ అని ఆయన ఘాటుగా స్పందించారు. ఈ తీర్పుతో ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ మళ్లీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


