Delhi : ఢిల్లీలో ఆప్‌ జలదీక్ష

Delhi : ఢిల్లీలో ఆప్‌ జలదీక్ష
X
నీటి విడుదల కోసం ఆతిశీ నిరాహార దీక్ష

హర్యానా నుంచి మరింత నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత ఆతిశీ శుక్రవారం ఢిల్లీలోని భోగల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తదితరులు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. హర్యానా, ఢిల్లీలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ నీటి విషయంలో రాజకీయాలేమిటని కేజ్రీవాల్‌ తన సందేశంలో ప్రశ్నించారు.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్, సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి.

హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్‌ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.

దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచో, ఆప్‌ పాలిత పంజాబ్‌ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్‌ మాఫియాతో ఆప్‌ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.

మరోవైపు తన భర్త ఇండియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్‌ ఉత్తర్వు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్‌ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ మండిపడ్డారు.

Tags

Next Story