Delhi NEET Racket :' నీట్ ' గా రాసి దొరికిపోయారు

నీట్ ఎగ్జామ్ రాకెట్ లోని మరో నలుగురు మెడికల్ కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఐడెంటిటీ తో పరీక్షలు రాస్తున్న ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్టు చేసిన నెల తర్వాత, ఇప్పుడు ఈ రాకెట్ నడుపుతున్న వారిలో పలువురు ముఖ్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థుల ఘరానా మోసాన్ని పోలీసులు ఛేదించారు. నీట్ పరీక్షలలో అభ్యర్థుల స్థానంలో వీరు పరీక్ష రాయటానికిగాను ఒక్కో అభ్యర్థి నుంచి ఏడు లక్షలు వసూలు చేసినట్టుగా సమాచారం. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించేది నీట్ పరీక్ష. ఈ పరీక్షలో అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో ఓ ముఠా పరీక్షలు రాయిస్తోంది. ఈ ముఠా నాయకుడితో సహా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో రేడియాలజీ రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రోయ్ ఈ గ్యాంగ్ నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. డబ్బులు ఆశ చూపి అనేకమంది ఎయిమ్స్ విద్యార్థులను నిందితుడు తన గ్యాంగ్లో చేర్చుకుంటున్నాడు. నీట్ పరీక్షల్లో అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి నరేష్ వారితో పరీక్ష రాయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే ఎక్కువ. మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ సమయంలో అసలు అభ్యర్థికి బదులు సంజూ యాదవ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అతడి బయోమెట్రిక్ సరిపోకపోవడంతో అనుమానం వచ్చి యాదవ్‌ను అరెస్టు చేశారు. అనంతరం తనిఖీ చేయగా అతని ఐడి కార్డు, ఆధార్ కార్డుతో సహా అధికారిక పత్రాలు అన్నీ కూడా నకిలీవేనని తేలింది. కేసు విచారణ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రోయ్ భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి, ఒకరికి బదులు మెడికల్ ప్రవేశ పరీక్షలో తాను పరీక్ష రాసేలా ఒప్పించాడని యాదవ్ వెల్లడించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర, నాగపూర్ లోని నీట్ పరీక్ష కేంద్రాలలో మరో ఇద్దరు విద్యార్థులు మహావీర్, జితేంద్ర కూడా ఇలాగే పట్టుపడ్డారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరీక్ష రాయడానికి బిష్ణోయ్ ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 7లక్షలు తీసుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు..కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు.
అయితే నీట్ పరీక్ష రాసే విద్యార్ధుల విషయంలో ఎన్నో కఠిన నిబంధనలు పెట్టి..అభ్యర్థులను ఎంత క్షుణ్ణంగా చెక్కింగ్ చేసినా ఇటువంటి మోసాలు జరుగటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com