ఫోన్ లో బెదిరింపులు... అమెరికా వాసుల లూటీ

ఫోన్ లో బెదిరింపులు... అమెరికా వాసుల లూటీ
కేసుల పేరుతో రూ.160 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ళకి ప్రదేశంతో సంబంధం లేదు. ఎవరి నుంచైనా డబ్బులు కొట్టేయడమే వారి లక్ష్యం. అది ఇండియన్ అయినా సరే అమెరికన్ లైనా సరే. అదే ఆలోచనతో పక్కా ప్లాన్ చేసి అమెరికన్లను బెదిరిస్తూ భారీగా డాలర్లు కొట్టేశారు కొంతమంది. ఎఫ్ బీ ఐ తో కలిసి ఢిల్లీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వీరు బాధితుల నుంచి 20 మిలియన్ డాలర్లు అంటే రూ.160 కోట్లు కాజేసినట్టుఅంచనా. ఈ ముఠాకు లీడర్ గా వ్యవహరిస్తున్న వత్సల్ మెహతాతో పాటు పార్థ్ ఆర్మార్కర్, దీపక్ అరోరా, ప్రశాంత్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం వీరంతా సోషల్ మీడియా, డార్క్ నెట్, ఇతర సామాజిక మాధ్యమాలలో పెద్దగా యాక్టివ్ గా ఉండని సంపన్నులను గుర్తించి, వివిధ మార్గాల ద్వారా వారి వివరాలు సేకరించే వారు. ఆపై వారికి ఉత్తమ్ ధిల్లాన్ నేతృత్వంలోని డిఈఏ ఏజెంట్లు అంటూ ఫోన్ చేసేవారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో చిన్నారుల అశ్లీల వీడియో ముఠా ఒకటి పట్టుబడిందని, వారి దగ్గర ఈ ఫోన్ నెంబర్ లభించిందని భయపెడతారు, అలాగే వారి కంప్యూటర్ నుంచి అభ్యంతరమైన క్లిప్పులు కూడా రికవరీ చేసినట్టు నకిలీ సాక్షాలను చూపిస్తారు, డ్రగ్ మాఫియా కోసం పని చేస్తున్నారని తెలిసిందంటూ బెదిరిస్తారు. అన్ని రకాలుగా బాధితులను టెన్షన్ కి గురి చేసాక, మొదటిసారి కాబట్టి జరిమానాతో సరిపెడుతున్నామని, జరిమానా చెల్లించకపోతే కోర్టు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తారు. బాధితుల ఆర్థిక స్తోమతను బట్టి లక్ష డాలర్లకు పైగా డిమాండ్ చేస్తారు. బాధితులు గూగుల్లో టైప్ చేసినప్పుడు అమెరికా డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పేరు ఉత్తమ్ ధిల్లాన్ అనే రావడంతో వారు ఇదంతా నిజం అనుకుంటారు. జైలు శిక్ష భయం, చట్టపరమైన అవాంతరాలు వస్తాయన్న భయంతో చాలా మంది డబ్బులు చెల్లించేస్తారు. ఈ గ్యాంగ్ కొంత నగదు రూపంలో, బంగారం లేదా క్రెప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటారు. అమెరికాలో ఏ రాష్ట్రంలో ఉన్నాసరే బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసుకోవడానికి నిందితులు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఇలా పలువురు అమెరికన్లను బెదిరించి 20 మిలియన్ డాలర్లను కొల్లగొట్టారని పోలీసులు వివరించారు. ఎఫ్ బీఐ, ఇంటర్ పోల్ ద్వారా ఈ ముఠాకు సంబంధించిన సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులకి చేసే పనిలో రన్నర్, బ్లాకర్స్ ఇలా ప్రత్యేకమైన రోల్స్ క్రియేట్ చేయబడ్డాయని చెప్తున్న పోలీసులు వీరిని కోర్టు ముందు హాజరు పరచి తరువాత 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story