Delhi: మహిళకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన డ్రైవర్.

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు. సమాచారం అందుకొని ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లే సమయానికి మహిళ రక్తమోడుతూ ఉందని, పక్కనే ఆమె మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.
మహిళని వెంటనే మెడికల్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, మే 26న బాధిత మహిళ బీహార్ నుంచి తన మూడేళ్ల కొడుకుతో కలిసి పంజాబ్‌లో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సర్దార్ మార్కెట్ వెళ్లింది. ఈ-రిక్షా ద్వారా తిరిగి మళ్లీ స్టేషన్ వచ్చే క్రమంలో, దాని డ్రైవర్ మహ్మద్ ఉమర్ మహిళకు కూల్‌డ్రింక్ అందించాడు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రతిఘటించినందుకు తలపై రాయితో దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు, మెలుకువ వచ్చిన తర్వాత తన మొబైల్ ఫోన్, రూ.3000 దొంగలించబడినట్లు చెప్పింది. దాదాపుగా 500 సీసీటీపీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 150 వరకు ఆటో రిక్షా డ్రైవర్లను విచారించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని హత్యయత్నం, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు మహిళ మొబైల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన రిక్షాను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com