Tamil Nadu : ఇకపై డెలివరీ బాయ్ కాదు ఆఫీసర్ సర్

మనం సాధారణంగా ఒక పని చేస్తే ఇంకో పని చేయలేము. పోనీ ప్రయత్నిద్దామా అంటే రెండు పడవల మీద ప్రయాణం అది ఇది చాలా జాగ్రత్తగా చెప్తారు.మనం కూడా మన చేతగానితనానికి టైమ్ లేదు, డబ్బులు లేవు లాంటి ఏదేదో కారణాలను చూపించి పనులు ఎగొట్టేస్తాం.. కానీ కొందరు ఉంటారు. వాళ్లు చేసే పనులలో ఎంత స్పష్టత ఉంటుంది అంటే చేసే పనిలో విజయం సాధించగలరు.. నలుగురికి ఆదర్శం గా నిలవగలరు. అలాంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం రండి.
ఓ వైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. మరోవైపు జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అతని కష్టం ఫలించి పరీక్షలో విజయం సాధించాడు. నిన్న మొన్నటి వరకు డెలివరీ బాయ్ గా మన ఇంటికి వచ్చిన ఈ యువకుడి సంతకం ఇకపై మనమే అతని ఆఫీస్ కి వెళ్ళాలి.
మనం చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు, ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పనిచేసే వారిని చూస్తుంటాం. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఫ్యామిలీని ఆర్ధికంగా ఆదుకోవడానికే చాలామంది కష్టపడుతుంటారు. అలాగే పని మొదలు పెట్టాడు తమిళనాడుకి చెందిన విఘ్నేష్. జొమాటో ఏజెంట్‌గా పనిచేస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష (TNPSC) పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. అతని సంకల్పం బలమైనది. కష్టం నిజమైనది. దీంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ పరీక్ష ఫలితాలు జూలై 12న విడుదలయ్యాయి. జూలై 24న, Zomato తన కుటుంబంతో ఉన్న విఘ్నేష్ చిత్రాన్ని ట్వీట్ చేసి అతని విజయం గురించి ప్రకటించింది. పోస్ట్ కి ఒక హార్ట్ సింబల్ ఇచ్చింది.
జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు 51 వేల మంది ఈ ట్వీట్‌ను చూడగా, 2500 మందికి పైగా లైక్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా జీవించాలన్న కలను కనటమే కాదు దానిని నిజం చేసుకున్నాడు. తను కష్టపడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడటం కాదు.. తన జీవితాన్ని స్థిరంగా నిలబెట్టుకున్న విఘ్నేష్ చాలామందికి ప్రేరణగా నిలిచాడు అంటూ ఈ పోస్టుపై నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com