Delhi: వణికిస్తున్న జ్వరాలు..

దేశ రాజధాని ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ప్రకటనలో తెలిపింది.
గత నెలలో భారీ వర్షాలు కురవడం.. యమునా నది ఉప్పొంగిపోవడంతో.. అక్కడ దోమలు పెరిగిపోయాయి. దీంతో ఆ వైరల్ జ్వరం కేసులు విపరీతంగా పెరిగాయి. దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధి లక్షణాల్లో జ్వరం, కళ్ల మంట, తలనొప్పి, కడుపునొప్పి, వాంతులు, కొన్ని సార్లు విరోచనాలు కూడా అవుతాయి. ప్రస్తుతానికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో డెంగీ, వైరల్ ఫీవర్ కేసులు పెరిగాయి.
అలాగే ఢిల్లీ నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్‌ఫ్లుఎంజా, టైఫాయిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్లేట్ లెట్ల కౌంట్ తగ్గి ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. రోగులు జ్వరాలతోపాటు అనారోగ్యం, బలహీనత, కీళ్ల నొప్పులు, దగ్గు, వాంతులు, అధిక గ్రేడ్ జ్వరంతో రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఫ్లూ లాంటి లక్షణాలతో వచ్చేవారిలో 20-25 శాతం పెరుగుదల ఉందని గురుగ్రామ్‌లోని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు హెపటైటిస్, టైఫాయిడ్ జ్వరాలతో జనం అవస్థలు పడుతున్నారు.
ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌లకు చెందిన 9వేల మంది నివాసితులను సర్వే చేయగా, గత నెల కంటే ఇప్పుడు 50 శాతం కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతున్నాయని వెల్లడైంది. జ్వరంతో బాధపడుతన్న వారు వెంటనే ఆసుపత్రుల్లో తమను సంప్రదించాలని వైద్యులు సూచించారు. జ్వరాల జోరుతో వణుకుతున్న ఢిల్లీలో ప్రస్తుతానికి కరోనా కేసులు మాత్రం లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
అయినా జ్వరాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు మాస్క్‌లు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు. చేతుల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. చేతులు కడుక్కోకుండా ముఖాన్ని తాకకూడదు. ఇది కాకుండా, ప్రజలు ఫ్లూ నిరోధించడానికి టీకా కూడా తీసుకోవచ్చని వెల్లడించారు. దగ్గు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, కీళ్లనొప్పులు, నీరసం, అలసట, శరీరంపై దద్దర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. ఆస్తమా, డయాబెటిస్ పేషంట్లతోపాటు చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com