SBI Electoral Bonds : ఈసీకి ఎన్నికల బాండ్ల వివరాలు

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఈ నెల 15 సాయంత్రం 5గంటల్లోగా ఈసీ కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్లో బహిరంగపరచనుంది. కాగా.. సుప్రీంతీర్పును అమలు కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అఖిల భారత బార్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఆదిశ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వివరాల వెల్లడి వల్ల.. సంస్థలను వేధించే అవకాశం ఉందని రాష్ట్రపతికి లేఖ రాశారు. దేశంలో కార్యకలాపాలు జరిపే విదేశీ సంస్థల ప్రతిష్ఠనూ ఇది దెబ్బతీస్తుందన్నారు. తన అసాధారణ అధికారాలతో సుప్రీం తీర్పును పునఃపరిశీలించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 16వేల 518 కోట్ల విలువైన బాండ్లను ఎస్‌బిఐ విక్రయించింది. అయితే ఈ పథకం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందంటూ పిటిషన్‌లు దాఖలు కాగా విచారణ జరిపిన సుప్రీం.. ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ సమర్పించిందని ఎన్నికల కమిషన్ ఎక్స్‌లో ప్రకటించింది. మార్చి 12 నాటికి బాండ్ల వివరాలను ఈసీకి ఇవ్వాలని, మార్చి 15 సాయంత్రం 5 గంటల నాటికి ఈ వివరాలను ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాల్సిందేనని సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో మూడు రోజుల్లో ఎలక్టోరల్ బాండ్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఎవరెవరు ఇచ్చారనే విషయాలు ఈసీ వెబ్‌సైట్ ద్వారా బహిర్గతం కానున్నాయి.
రాజకీయ పార్టీలకు వచ్చే నిధుల్లో పారదర్శకతను తీసుకువస్తామని చెప్తూ, నగదుగా నిధులను తీసుకోవడానికి బదులుగా 2018 జనవరి 2న కేంద్రం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం ఎస్బీఐకి మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను విక్రయించే అధికారం ఇచ్చింది. దీంతో 2018 మార్చి నుంచి ఇప్పటివరకు 30 విడతలుగా ఎస్బీఐ రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది. ఎవరు ఇచ్చారు, ఏయే పార్టీలకు ఇచ్చారనే వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటకు వెల్లడి కాలేదు. అజ్ఞాత వ్యక్తుల నుంచి నిధులు పొందేందుకు అవకాశం ఇస్తున్న ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com