Devendra Fadnavis: సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం..

Devendra Fadnavis: సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం..
X
పూణె రోగికి రూ.5లక్షల సాయం ఫైల్‌పై సిగ్నేచర్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు. పూణెకు చెందిన రోగి చంద్రకాంత్ శంకర్ కుర్హాడేకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం అందించే ఫైల్‌పై ఫడ్నవిస్ తొలి సంతకం చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ఫ్లాంట్(ఎముక మజ్జ మార్పిడి చికిత్స) కోసం రూ.5 లక్షల సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

ముంబైలో జరిగిన ప్రమాణస్వీకారంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, చిరాగ్‌ పాశ్వాన్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల్లో మహాయుతి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా… భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) వరుసగా 20, 10 స్థానాలను గెలుచుకున్నాయి.

దేవేంద్ర ఫడ్నవీస్‌ పొలిటికల్ కెరియర్ :

దేవేంద్ర ఫడ్నవీస్‌ తండ్రి గంగాధర్‌ ఫడ్నవీస్‌ జనసంఘ్‌, బీజేపీలో చురుగ్గా పని చేశారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్‌ 22 ఏండ్ల వయసులోనే నాగ్‌పూర్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో 27ఏండ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన.. 2014లో మొదటిసారి మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్‌ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022 జూన్‌లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. షిండే కేబినెట్‌లో ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

Tags

Next Story