Ayodhya Ram Mandir: సాధారణ భక్తులకు బాలరాముని దర్శనం

Ayodhya Ram Mandir:  సాధారణ భక్తులకు బాలరాముని దర్శనం
X
వేకువజామున 3 గంటలకే చేరుకున్న భక్తులు

అయోధ్య బాలరాముడు నేటి నుంచి సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. తొలి రోజు రామ్‌లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరుగుతున్నాయి. కాగా తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి.

అయోధ్యలో ఎక్కడ విన్నా రామనామ స్మరణే వినపడుతుంది. బాలరాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. అయితే బాలరాముడిని దర్శించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు. దీంతో భక్తులు ఈరోజే దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు.


భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. బాలరాముడి దర్శనానికి భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా పాస్‌లు పొందవచ్చు. అయితే ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు. అప్‌డేట్స్‌ కోసం ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలి. అయోధ్య రామాలయ అధికారిక వెబ్‌సైట్‌ లో మొబైల్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ అవుతుంది. మై ఫ్రొఫైల్‌’ అనే సెక్షన్‌పై క్లిక్‌ చేసి, హారతి/దర్శన స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. అవసరమైన వివరాలు సమర్పించి పాస్‌ బుకింగ్‌ చేసుకొన్న తర్వాత.. కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. ఆలయం ప్రాంగణంలోని కౌంటర్‌ వద్ద పాస్‌ తీసుకొని దర్శనానికి వెళ్లొచ్చు. అదే ఆఫ్ లైన్ అయితే ఆలయ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లి, చెల్లుబాటు అయ్యే ఏదైనా ప్రభుత్వ ధ్రువీకరణ ఐడీ సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో పాస్‌లు పొందవచ్చు.

భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.

Tags

Next Story