Supreme Court: ఆలయ నిధులు కల్యాణ మండపాల నిర్మాణానికి కాదు: సుప్రీంకోర్టు

Supreme Court: ఆలయ నిధులు  కల్యాణ మండపాల నిర్మాణానికి కాదు: సుప్రీంకోర్టు
X
దేవాలయ నిధులను ప్రభుత్వ సొమ్ముగా పరిగణించవద్దని హితవు

ఆలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని పేర్కొన్న సుప్రీం కోర్టు.. దేవాలయ నిధులు ప్రజల నిధులుగానో, ప్రభుత్వ నిధులగానో పరిగణించకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఐదు ప్రముఖ ఆలయాల నిధులను ఉపయోగించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం, గత నెల 19న ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. కల్యాణ మండపాలు నిర్మించి, వాటిని పెళ్లిళ్ల కోసం అద్దెకు ఇవ్వడం అనేది ‘మతపరమైన కార్యక్రమం’ కిందకు రాదని హైకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. "భక్తులు తమ డబ్బును కల్యాణ మండపాల నిర్మాణం కోసం ఆలయాలకు ఇవ్వరు. ఆలయాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే విరాళాలు ఇస్తారు" అని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఆలయ నిధులను విద్య, వైద్య సంస్థల ఏర్పాటు వంటి ఇతర సేవా, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించింది. అంతేకానీ, వాణిజ్యపరమైన నిర్మాణాలకు వాడటం సరికాదని హితవు పలికింది. ఈ వ్యాఖ్యలతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆలయ నిధుల వినియోగంపై ప్రభుత్వాల అధికారాలకు పరిమితులు ఉంటాయని మరోసారి స్పష్టమైంది.

Tags

Next Story