Puri Jagannath Heritage Corridor : నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం

Puri Jagannath Heritage Corridor : నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం

ఒడిశా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న...శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప మహాప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. 12వ శతాబ్దపు పూరీక్షేత్రం పరిసరాలు వేదగోషను నినదిస్తున్నాయి. పూర్ణాహుతితో పరిసమాప్తం కానున్న మహాయజ్ఞం తర్వాత 800కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధ్యాత్మిక ప్రాజెక్టు శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్పను సీఎం నవీన్‌ పట్నాయక్‌ భక్తులకు అంకితం ఇవ్వనున్నారు.

12వ శతాబ్దంనాటి ఆధ్యాత్మిక పూరీక్షేత్రం ఔనత్యాన్ని మరింత పెంచేందుకు ఒడిశా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీజగన్నాథ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు...ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శ్రీజగన్నాథ పరిక్రమ ప్రకల్పప్రాజెక్టు కారిడార్‌లో భాగంగా శ్రీజగన్నాథ్‌ బల్లవ్‌ పార్కింగ్‌ ప్రదేశం, శ్రీసేతు పేరుతో వారధి నిర్మాణం, పుణ్యక్షేత్రాల కేంద్రాలు, పూరీ క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికుల రాకపోకల కోసం శ్రీమార్గ్‌ పేరుతో నూతన రహదారి నిర్మాణం చేపట్టారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం, భక్తులు సామాన్లను భద్రపర్చుకునేందుకు క్లాక్‌ రూములు, జగన్నాథ ఆలయంలోపలా, పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పించారు.

చారిత్రక నేపథ్యంతోపాటు ఆధ్యాత్మిక ప్రాశస్థ్యం కలిగిన పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు 4వేల కోట్లరూపాయలతో...ఒడిశా ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. అందులో ఒక భాగమే...శ్రీజగన్నాథ లేదా శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు అని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనుల కోసం 800కోట్లు వ్యయం చేశారు. మేఘనాథ పచేరిగా పిలిచే జగన్నాథ ఆలయం వెలుపలిగోడ చుట్టూ విశాలమైన కారిడార్లను నిర్మించారు. 12వ శతాబ్దపు పూరీ ఆలయాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అద్భుత దృశ్యం తిలకించామనే అనుభూతిని పంచనున్నాయి. తీర్థయాత్రికులకు సకల సౌకర్యాలు, ఆలయంతోపాటు భక్తుల భద్రత, రక్షణను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు.


శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప ప్రారంభోత్సవం నేపథ్యంలో పూరీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగులు పూలు, విద్యుత్తు దీపాల అలంకరణతోపాటు గ్రాఫిటీ చిత్రకళ దృశ్యాలతో ఈఆధ్మాత్రిక క్షేత్రం కొలువైన పూరీ పట్టణం భక్తులకు కనులవిందుగా మారింది. ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 90 పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతినాడు మహాయజ్ఞం ప్రారంభమైంది.ఈ మధ్యాహ్నం గజపతి మహారాజు దివ్యసింఘ దేవ్‌ నిర్వహించే పూర్ణాహుతితో మహాయజ్ఞం పరిసమాప్తం కానుంది. ఆ తర్వాత ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌శ్రీమందిర్‌ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును భక్తులకు అంకితం చేయనున్నారు.

ఈ ఆధ్యాత్మిక మహాక్రతువులో ప్రజలు భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో ఒడిశా సర్కార్‌ ఇవాళ సెలవుదినంగా ప్రకటించింది. అన్నిప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీజగన్నాథ పరిక్రమ ప్రాజెక్టు... ప్రారంభోత్సవానికి ప్రముఖులతోపాటు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో ...నాలుగంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2వేల 4వందల పోలీసు బలగాలను మోహరించారు. వందమంది పర్యవేక్షణాధికారులు, 250 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ASI భద్రతావిధుల్లో ఉంటారని ఒడిశా ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.

Tags

Read MoreRead Less
Next Story