Konark: 122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్’ గర్భ గుడి

ఒడిశాలోని 13వ శతాబ్దపు కోణార్క్ సూర్య దేవాలయ గర్భ గుడిలోకి త్వరలో భక్తులు ప్రవేశించే అవకాశం రానున్నది. ప్రస్తుతం ఆ స్థలం ఇసుకతో నిండి ఉంది. దాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు. ఆలయం వెనుక ఉన్న 15 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్ పాలకులు 1903-04లో గర్భ గుడిని వేల టన్నుల ఇసుకతో నింపారు. జగ్‌మోహన్ హాల్‌గా పిలిచే ఈ ప్రాంతంలోకి శతాబ్దం పాటు ఎవరూ ప్రవేశించలేదు. తాజాగా భారత పురావస్తు శాఖ, ఐఐటీ మద్రాస్ నిపుణులతో కూడిన బృందం ఈ ఇసుకను తొలగించే పని చేపట్టింది. మొత్తం ఇసుకను తరలించడానికి మూడు నెలలు పడుతుందని ఓ పురావస్తు శాఖ అధికారి తెలిపారు. ఇసుకను తరలించిన తర్వాత లోపలి గోడల పటిష్ఠతను పరిశీలించి గుడి పునర్ నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు మనకు సాంకేతిక నిధులు. అలాంటి వాటిలో కోణార్క్ దేవాలయం. పన్నెండేళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయం విద్యని అందించే ఒక మహా విశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని, వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోభిల్లుతోంది.
వ్యక్తి తన జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన విఙ్ఞానాన్ని ఇది అందిస్తోంది. కోణార్క్ ఆలయం ఆధార భాగంలో అంటే నేలకు రెండు అడుగుల ఎత్తులో శిల్పాలను పరిశీలిస్తే ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షులు వాటి విన్యాసాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ప్రధానంగా పిల్లలను ఆకర్షిస్తాయి. వాటి ఆహారపు అలవాట్లు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి.
వీటి పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తూ, కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తోన్న శిల్పాలు కనబడతాయి. ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు ఉంటాయి. ఇవి 6 నుంచి10 ఏళ్ల వయసు గల పిల్లల మెదడుకు పదును పెడతాయి.
రథంలా ఉండే ఈ ఆలయానికి 24 చక్రాలు ఉంటాయి. ఇవి అందం కోసం చెక్కినవి అని అందరూ భ్రమపడతారు. కానీ అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయని తెలిసి ముక్కున వేలేసుకుంటారు. అలాగే రథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లు రూపొందించారు. ఇవి వారంలోని 7 రోజులకు ప్రతీక అని, సూర్య రశ్మిలోని ఏడు వర్ణాలకు ప్రతీకలని కొందరూ చెబుతారు. నిశితంగా పరిశీలిస్తే రాజకీయం, యుద్ధ కళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు దర్శనమిస్తాయి. ఇవి కౌమార దశలోని విద్యార్ధులకు విఙ్ఞానాన్ని అందిస్తాయి.
విధ్వంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భ గుడి ఎంతో అద్భుతమైన కట్టడం. గర్భ గుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి, సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారుచేశారు. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపజేసేవట.
అయితే ఈ అయస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పని చేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు చరిత్రలు చెబుతున్నాయి. అంతే కాదు, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే, ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు అగుపిస్తుంది. అహంకారానికి, పొగరుకి సింహం నిదర్శనం, ఏనుగు ధనానికి ప్రతీక, ఈ రెండూ మనిషికి ఉంటే అతడిని పతనం చేస్తాయి అనే సందేశాన్ని ఈ శిల్పం ఇస్తుంది. అలాగే, 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికీ, బలానికీ ప్రతీకలుగా నిలుస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
