DHARMASTHALA: హత్యలు లేవు.. హత్యాచారాలూ లేవు... "ధర్మ స్థలమే"

కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఇక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, తానే ప్రత్యక్ష సాక్షినంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ధర్మస్థల ఆలయం ఇటీవల సంచలనాత్మక ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. 1995 నుంచి 2014 వరకూ మంజునాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన భీమా అనే వ్యక్తి జూన్ నెలలో పోలీసుల ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పని చేసిన కాలంలో వందలకొద్దీ అమ్మాయిలు, మహిళల మృతదేహాలను నేత్రావది నది ఒడ్డున పాతి పెట్టానని, వాళ్లంతా లైంగిక వేధింపులకు గురైన వారేనని వెల్లడించాడు. గతంలో ధర్మస్థలలో పలు మిస్సింగ్ కేసులు కూడా నమోదు కావడంతో అతని ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న కర్నాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణబ్ మహంతీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. కార్మికుడు చెప్పినట్లు దర్యాప్తు మొదలు పెట్టింది. పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన 13 ప్రదేశాల్లో సిట్ తవ్వకాలు చేపట్టింది. కొన్నిచోట్ల అస్థిపంజరాలు, కొన్ని వస్తువులు లభించాయి. అయితే అవి సామూహిక ఖననాలకు సంబంధించినవి కావని తేలింది. ఇతర జబ్బులతో చనిపోయిన వాళ్ల అస్థికలుగా సిట్ గుర్తించింది. అయినా కార్మికుడు చెప్పిన ప్రతి ప్రాంతంలోనూ సిట్ తవ్వకాలు చేపట్టింది. కానీ అతను చెప్పినట్లు సామూహిక ఖననాల ఆనవాళ్లు లభించలేదు.
ధర్మస్థల విశిష్టతను దెబ్బ తీసే కుట్ర
ధర్మస్థల కేసులో పెద్ద కుట్ర జరుగుతోంది. ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, శతాబ్దాల నాటి సంప్రదాయాలను దెబ్బతీసేందుకు ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని కొందరు రూపొందించారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగింది. దీర్ఘకాలంగా ఉన్న సంప్రదాయానికి అపఖ్యాతి తీసుకురావడానికి ఎవరో గట్టిగా ప్రయత్నించారు. ముసుగు ధరించిన వ్యక్తి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చాడు. శివలింగెగౌడ, బేలూరు గోపాలకృష్ణ, అశోక్ రాయ్ సహా పలువురు నాయకులు సీఎల్పీలో దీని గురించి మాట్లాడారు. ఈ కేసు నిరాధారమైనదని, శూన్యమైనది. ఏవైనా తప్పుడు ఆరోపణలు లేదా కుట్రలు ఉంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా ఆదేశించింది. ధర్మస్థలలో రాజకీయ జోక్యంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు.
హైందవ ధర్మంపై దాడి
ఇది హైందవ ధర్మంపై దాడిగా అభివర్ణించారు. హిందూమతంపై విషం చిమ్మడంలో భాగంగానే కొంతమంది ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కర్నాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఏకంగా ఫిర్యాదు దారుడే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. ధర్మస్థల సామూహిక ఖననాల కేసు ఒక సంచలన ఆరోపణతో మొదలైంది. ఇప్పుడు రహస్య కుట్రలతో మరో మలుపు తీసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడు యూటర్న్ తీసుకోవడం, తవ్వకాలలో ఆధారాలు లభించకపోవడం.. లాంటివి ఈ కేసును మరింత జటిలంగా మార్చేశాయి. ఇప్పుడు మరోసారి ముసుగు మనిషి మాట మార్చడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం రేగుతోంది. ఇది కేవలం హైంధవ ధర్మంపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com