DHVANI: బ్రహ్మోస్ కంటే భీకరం..శత్రు వినాశకరం "ధ్వని"

అగ్ని-5 కంటే మెరుగైన శక్తితో, 6 నుంచి 10 వేల కిలోమీటర్ల రేంజ్‌తో ‘ధ్వని’ హెచ్‌జీవీ మోడల్‌ను డీఆర్డీవో ఆవిష్కరించింది. ఇది హైపర్‌సానిక్ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగల అత్యాధునిక సామర్థ్యం కల క్షిపణి వ్యవస్థగా నిలుస్తోంది. దాదాపు 29.5 మీటర్ల పొడుగు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ ధ్వని హెచ్‌జీవీ రేంజ్ ఎంతో డీఆర్డీవో వర్గాలు బయటకు వెల్లడించనప్పటికీ.. అది మన అమ్ములపొదిలో ఇప్పటికే ఉన్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ (5,500 కి.మీ) కన్నా ఎక్కువగా (6-10 వేల కిలోమీటర్ల దాకా) ఉంటుందని సమాచారం. అంటే.. మనదేశంలోని లాంచ్ సైట్ల నుంచి ఆసియా, యూర్‌పతోపాటు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాల్లోని లక్ష్యాలను సైతం ఇది ఛేదించగలదు.
కాగా.. ధ్వని హెచ్‌జీవీ ప్రయాణించే తీరు ప్రత్యేకంగా ఉంటుందని, తొలుత బాలిస్టిక్ బూస్ట్ దశ.. తర్వాత ఎక్స్టెండెడ్ గ్లైడ్ దశతో అది హైపర్‌సానిక్ వేగంతో సుదూరతీరాలకు ప్రయాణిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. గాల్లో వెళ్తుండగానే దిశ మార్చుకోగలిగే సామర్థ్యం ఽఉండే హెచ్జీవీలను సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. పాకిస్థాన్, చైనా వంటి దేశాల నుంచి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి ఎదురయ్యే పరోక్ష సవాళ్లకు ప్రతిఘటనగా ఈ హైపర్సోనిక్ ఆయుధ శ్రేణులు రూపొందుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారతదేశ రక్షణ వ్యూహంలో కీలకమైన ముందడుగు. హైపర్సోనిక్ ఆయుధాలు అంటే ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించగల ఆయుధాలు.
ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి..
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ‘ధ్వని’ పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని డీఆర్డీఓ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేస్తాయని అంచనా. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యం హెచ్జీవీల సొంతం. శబ్ద వేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించగలవు. డీఆర్డీఓ సిద్ధం చేస్తోన్న హెచ్‌జీవీ సుమారు గంటకు 7వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 1500 నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా. వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com