Panneerselvam: పన్నీర్ సెల్వంకు వెరైటీ చిక్కులు

Panneerselvam: పన్నీర్ సెల్వంకు వెరైటీ  చిక్కులు
స్వ‌తంత్ర‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్నాడీఎంకే తనను బహిష్కరించడంతో ఈసారి ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పన్నీర్‌ సెల్వం బరిలో నిలిచారు. అన్నాడీఎంకే శ్రేణులు తనవైపు ఉన్నారా..పళనిస్వామి వైపు ఉన్నారా తేల్చుకునేందుకు ఈ ఎన్నికలే పరీక్ష అని పన్నీర్‌ సెల్వం అంటున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మరోవైపు పన్నీర్‌ సెల్వం పేరుతో మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఆయనకు మరో అడ్డంకిగా మారింది.

తమిళనాడులోని రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌ సెల్వం ఎన్డీయే మద్దతుతో ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆయనకు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా రామనాథపురం సీటులో ముక్కోణపు పోటీ నెలకొంది. పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే, IUML మధ్య త్రిముఖ పోరు ఉండడంతో ఈ ఎన్నిక పన్వీర్‌సెల్వంకు పెద్ద సవాల్‌గా మారుతోంది.

అన్నాడీఎంకే తనను బహిష్కరించడం, రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు న్యాయస్థానాలు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని పన్నీర్‌ సెల్వం... కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే శ్రేణులుతనవైపు ఉన్నారా పళనిస్వామి వైపు ఉన్నారా తేల్చుకునేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇదే స్థానం నుంచిఅన్నాడీఎంకే తరఫున జయపెరుమాల్‌ పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌- IUML అభ్యర్థిగా నవాజ్‌ కని బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 25 మంది పోటీలో ఉన్నా ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

రామనాథపురం నియోజకవర్గంలో పన్నీర్‌ సెల్వంకు మరో చిక్కువచ్చి పడింది. ఓ.పన్నీర్‌ సెల్వం పేరుతో మరో నలుగురు స్వతంత్రులు బరిలో ఉండడంతో ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఈ ఐదుగురు ఒ. పన్నీరు సెల్వంలుప్రచారంలో ఉన్నారు. అందరూ స్వతంత్రులే కావడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఈవీఎంలపై ఈ స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం, వరుస సంఖ్యలోనూ గందరగోళం ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నా ఈవీఎంలపై పొట్టి అక్షరం ‘ఒ’నే వాడుతుండటంతోఅందరి పేర్లూ ఒకేలా ఉండనున్నాయి.

పన్నీర్‌ సెల్వం గుర్తు పనస పండు కాగా, మిగిలిన నలుగురికీ బకెట్‌, చెరకుతో రైతు, ద్రాక్ష, గాజు గ్లాసు గుర్తులు వచ్చాయి. కేవలం చిహ్నం చూసి మాత్రమే జనాలు అసలు పన్నీర్‌ సెల్వం ఎవరో గుర్తుపట్టాల్సి వస్తోంది. కొంచెం పొరపాటు జరిగినా ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఈ పరిస్థితి పన్నీర్‌ సెల్వంకు పెద్ద సమస్యగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story