Digital Arrest Scam: ఏకంగా ఎమ్మెల్యేనే ముంచేశారు కదరా..

Digital Arrest Scam: ఏకంగా ఎమ్మెల్యేనే ముంచేశారు కదరా..
X
రూ.31 లక్షలు స్వాహా చేసిన స్కామర్లు!

ఈ మధ్య తరుచు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎందరినో స్కామర్లు దోచుకుంటున్న విషయాలు చూస్తూనే ఉన్నాము. ఇలా స్కాంలో తాజాగా చిక్కుకున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే గుండప్ప వకిల్ ఎనిమిది రోజుల్లో దాదాపు రూ. 31 లక్షలు పోగొట్టుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP), ఒక న్యాయమూర్తిగా నటిస్తూ మోసగాళ్లు ఈ కుట్రకు పాల్పడ్డారు.

అసలేమైందన్న విషయానికి వస్తే.. ఆగస్టు 12 సాయంత్రం ఒక నకిలీ సీబీఐ అధికారి గుండప్ప వకిల్‌కు ఫోన్ చేసి.. వ్యాపారవేత్త నరేష్ గోయల్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయన పేరు కూడా ఉందని చెప్పారు. సీబీఐ అధికారులు జప్తు చేసిన వాటిలో గుండప్ప పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు ఉన్నాయని, ఇవి నిధుల దుర్వినియోగానికి సంబంధించినవని ఆ మోసగాడు తెలిపాడు. ఆ తర్వాత, నకిలీ సీబీఐ అధికారి బాధితుడి వ్యక్తిగత వివరాలు, ఆస్తుల వివరాలు అడిగి తీసుకున్నాడు.

ఆ తర్వాత, ఆ కాల్‌ను నీరజ్ కుమార్ అనే వ్యక్తికి బదిలీ చేశారు. అతను తనను తాను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పరిచయం చేసుకుని, గుండప్ప వకిల్‌ను ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ కాల్ కట్ చేయకూడదని బాధితుడికి గట్టిగా సూచించాడు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో, మోసగాళ్లు బాధితుడిని వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ ‘న్యాయమూర్తి’ గుండప్పను ఆదేశించాడు. అంతేకాకుండా, RTGS ద్వారా రూ. 10.99 లక్షలను ఒక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించాడు.

ఆ తర్వాత నీరజ్ కుమార్, మరో అధికారి సందీప్ కుమార్ అనే వ్యక్తులు ప్రతిరోజూ గుండప్ప వకిల్‌ను ఫోన్ చేస్తూ, దర్యాప్తు పేరుతో ఆయనను.. వారితోపాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ వివరాలను సేకరించారు. కొద్ది రోజుల తర్వాత, ఎమ్మెల్యేను మరోసారి వీడియో కాల్ ద్వారా ‘న్యాయమూర్తి’ ముందు హాజరుపరిచారు. ఈసారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు కోసం రూ. 20 లక్షలు బదిలీ చేయాలని ఆదేశించారు. డబ్బు బదిలీ చేస్తే, విచారణ పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆ డబ్బును కూడా బదిలీ చేశాడు.

చివరకు డబ్బు తిరిగి రాకపోవడం, మోసగాళ్ల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 73 ఏళ్ల గుండప్ప వకిల్ తాను ‘డిజిటల్ అరెస్ట్’ కు బలైపోయానని గ్రహించారు. సెప్టెంబర్ 6న, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఈ విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story