Gujarat: 90 ఏళ్ల గుజరాత్ వ్యక్తి డిజిటల్ అరెస్ట్, రూ.కోటి నగదు మాయం

గుజరాత్‌లో ఘటన..

గుజరాత్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడిని చైనాలో ఓ ముఠాతో కలిసి రాకెట్ నడిపిస్తున్న గ్యాంగ్ డిజిటల్ అరెస్ట్ చేసి రూ.కోటి నొక్కేశారు. సీబీఐ అధికారులుగా నటిస్తూ 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచారు. పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయని బెదిరింపులకు దిగారు. మీ పేరు మీద ముంబై నుంచి చైనాకు కొరియర్ పంపినట్లు హడలెత్తించారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ముఠా సభ్యులు రూ. 1,15,00,000 బదిలీ చేసుకున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులకు అక్టోబర 29న ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి పార్థ్ గోపాని కోసం గాలిస్తున్నారు. పార్థ్ గోపానీ కంబోడియాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వృద్ధుడు సంపాదించిన కోటి రూపాయులు కేటుగాళ్లు నొక్కేయడంతో లబోదిబో అంటున్నాడు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) భవేష్ రోజియా మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేసే సీనియర్ సిటిజన్‌కు స్కామ్‌స్టర్లలో ఒకరి నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, అతను తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ముంబయి నుంచి చైనాకు సీనియర్‌ సిటిజన్‌ ​​పేరుతో కొరియర్‌లో పంపిన పార్శిల్‌లో 400 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ లభించినట్లు బెదిరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో 15 రోజులు ఏడిపించారు. మొత్తానికి రూ.కోటికిపైగా నగదు నొక్కేశారు. అరెస్టయిన వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 46 డెబిట్ కార్డులు, 23 బ్యాంక్ చెక్ బుక్‌లు, ఒక వాహనం, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రమేష్ సురానా, ఉమేష్ జింజాలా, నరేష్ సురానా, రాజేష్ దేవరా, గౌరంగ్ రఖోలియా ఉన్నారు.

Tags

Next Story