Maha Kumbh Mela 2025:ప్రయాగ్‌రాజ్‌కు రానున్న 73 దేశాల దౌత్య వేత్తలు

Maha Kumbh Mela 2025:ప్రయాగ్‌రాజ్‌కు రానున్న 73 దేశాల దౌత్య వేత్తలు
X
ఇప్పటికే 12 కోట్లకుపైగా పుణ్యస్నానాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం వరకు 12 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహా వైభవంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అంతేకాకుండా 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

రష్యా, ఉక్రెయిన్ సహా అమెరికా, జపాన్‌, జర్మనీ, నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా ఇలా 73 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. దౌత్యవేత్తలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం అక్షయావత్‌, బడే హనుమాన్‌ ఆలయాన్ని సందర్శిస్తారు.

భక్తుల రాకతో ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు, పారామెడిక్స్, ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.

Tags

Next Story