భానుడి ప్రతాపంతో అప్రమత్తం అయిన కేంద్రం

జూన్ నెల వచ్చేసింది అయినా సరే దేశవ్యాప్తంగా ఎండలలో మార్పు రాలేదు. వడగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాల్లో రుతుపవనాలు జాడలేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బీహార్, హర్యానా, వెస్ట్ బెంగాల్ తో సహా పలు ప్రాంతాలలో రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో వైద్యశాఖ సంసిద్ధతను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుషక్ మాండవియా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
వడగాలుల వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని కూడా మెడికల్ రీసెర్చ్ కు మంత్రి ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఐఎండీకి చెందిన ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం వడగాలిల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో వర్చువల్ భేటీ నిర్వహించనున్నట్లుగా మంత్రి వెల్లడించారు.
వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. గడచిన 48 గంటల్లో బీహార్లు తొమ్మిది మంది వడ దెబ్బకు ప్రాణాలు కోల్పోయినట్లుగా డిఎండి వెళ్లడించింది.
మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతావరణాన్ని హీట్‌వేవ్‌గా పేర్కొంటారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, క్రానిక్ డిసీజెస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలోకి వెళ్లేవారు తలపై కేప్ పెట్టుకోవడం, టవల్ చుట్టుకోవడం వంటివి చేయాలని సూచించింది. కళ్ళు తిరగడం, వికారంగా ఉండడం, తలనొప్పిగా ఉండడం, విపరీతమైన దాహం వేయడం, మూత్ర విసర్జన తగ్గడం, మూత్రం రంగు మారడం, గుండె దడ వంటి లక్షణాలు వడదెబ్బ యొక్క సాధారణమైన లక్షణాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే అత్యవసర పరిస్థితిలో 108కి కానీ 102కు కానీ కాల్ చేసి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com