DISNEY HOTSTAR: అంబానీ దెబ్బకు అల్లాడుతున్న డిస్నీ

DISNEY HOTSTAR: అంబానీ దెబ్బకు అల్లాడుతున్న డిస్నీ
జియో సినిమా దెబ్బకు అల్లాడిపోతున్న డిస్నీ + హాట్ స్టార్... భారత వ్యాపారాన్ని విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు.... ఇప్పటికే భారీగా యూజర్లను కోల్పోయిన డిస్నీ...

డిజిటల్ ఓటీటీ వేదికల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో జియో సినిమా (JIO CINIMA) కొట్టిన దెబ్బకు ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ + హాట్ స్టార్ అల్లాడిపోతోంది. మొబైల్‌ రంగంలో జియో ధాటికి కొన్ని టెలికాం సంస్థలు మూతపడితే మరికొన్ని పోటీని తట్టుకొని ఒకే ప్రొడక్ట్‌గా మారిపోయాయి. ఇక ఓటీటీ(OTT) రంగంలో ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ ప్రసార హక్కులతో జియా డిస్నీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంతో ఓటీటీ వేదికల వీక్షకులు పూర్తిగా జియో సినిమా వైపు మళ్లారు. జియో సినిమా ‍(JioCinema) యాప్ ప్రభావంతో ఇప్పటి వరకు దేశంలో టాప్ డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీస్ సంస్థ డిస్నీ + హాట్‌స్టార్‌ భారీగా సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. గత త్రైమాసికంలో సబ్ స్క్రిప్షన్లు 5.29 కోట్లకు పడిపోయాయి. డిసెంబర్ త్రైమాసికం నాటికి 6.13 కోట్లుగా ఉన్న సబ్ స్క్రైబర్లు.. మార్చి నెలాఖరు నాటికి 38 లక్షల మంది తగ్గిపోయారు.


ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు డిస్నీ కీలక నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి కానీ, పార్ట్‌నర్‌లతో నడిపేందుకు కానీ వాల్ట్ డిస్నీ (DIS.N) అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, కొనుగోలుదారు లేదా భాగస్వామిని ఇప్పటివరకు సంప్రదించలేదని, ప్రక్రియ ఎలా సాగుతుందో ఇప్పుడే చెప్పలేమని డిస్నీ హాట్‌స్టార్‌ వర్గాలు తెలిపాయి.


అంతర్గత చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మాత్రం స్పష్టం చేశాయి. అమెరికాలోని డిస్నీ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌లో డిస్నీ వ్యాపారంపై చర్చలు ప్రారంభించారని వెల్లడించాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ(ambani) సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RELI.NS) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ దెబ్బకు డిస్నీపై ఒత్తిడి పెరుగుతున్న విషయం చర్చకు వచ్చినట్లు తెలిపాయి. దీనిపై డిస్నీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ చర్చల నేపథ్యంలో డిస్నీ షేర్లు మంగళవారం 1.6 శాతం మేర పెరిగాయి. డిస్నీ వ్యాపారం భారత్‌లో సుమారు 15, 16 బిలియన్‌ డాలర్లు ఉంటుందని దీనిని పూర్తిగా కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.


ఖర్చులను తగ్గించుకునేందుకు డిస్నీ భారీగా ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపులు, ఇతర వ్యయతగ్గింపు చర్యల ద్వారా 5.5 బిలియన్‌ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు రౌండ్లుగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టినట్లు డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ ప్రకటించారు. మొదటి రౌండ్ లేఆఫ్స్‌ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్‌లో ఏప్రిల్‌లో 4వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7,000 మందిని తొలగించనున్నారు. అక్టోబరు 1 నాటికి, డిస్నీకి 220,000 మంది ఉద్యోగులు ఉన్నారు

Tags

Read MoreRead Less
Next Story