OMAR ABDULLAH: జమ్ముకశ్మీర్ సీఎం విడాకుల వ్యవహారం

జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా కలిసి కూర్చుని తమ వైవాహిక వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దంపతులిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది. ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
"ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైంది. దంపతులకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. ఇద్దరు కూర్చొని తమ మధ్య వివాదానికి కారణమైన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలి. మూడు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి" అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది.
ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య గత కొన్నేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. ఆమెతో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఒమర్ ఆశ్రయించారు. కానీ, న్యాయస్థానం దానిని తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ 2023లో ఆయన దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఒమర్‌కు నిరాశే మిగిలింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపై విచారణ జరిపి అత్యున్నత న్యాయస్థానం దంపతులకు కలిసి మాట్లాడుకోవాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com