ఎంపీలకు వేడి వేడి ఇడ్లీలు తినిపించిన డీఎంకే నేతలు

ఎంపీలకు వేడి వేడి ఇడ్లీలు తినిపించిన డీఎంకే నేతలు

వ్యవసాయ బిల్లులపై ఆందోళన ఉద్ధృతం చేశాయి విపక్షాలు. పార్లమెంట్ ఆవరణలో సస్పెండైన 8 మంది ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాత్రి కూడా గాంధీ విగ్రహం వద్దే నిద్రపోయారు. ఉదయం కూడా తమ నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్నారు. దీక్షకు దిగిన ఎనిమిది మంది విపక్ష ఎంపీలకు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ స్వయంగా టీ తీసుకొని వెళ్లారు. వారందరికీ నచ్చచెప్పి టీ తాగించేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు ఎంపీలు నిరాకరించారు.. టీ తాగేది లేదంటూ సున్నితంగా తిరస్కరించారు.. డిప్యూటీ చైర్మన్ రైతు వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు.

ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్నాయి విపక్షాలు. నూతన వ్యవసాయ బిల్లును ఆమోదించద్దని రాష్ట్రపతికి వారు విజ్ఞప్తి చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, వామపక్షాలు, శివసేన, టీఆర్‌ఎస్‌, ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, తృణమూల్‌, ఆర్జేడీ సహా ఎన్డీయేతర 15 పార్టీల నేతలు రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు..

కేంద్ర వ్యవసాయ బిల్లులను ఆమోదించే సమయంలో రాజ్యసభలో చోటుచేసుకున్న ఘటనలపై ఎంపీలు వెనక్కు తగ్గడం లేదు.. రైతులకు వెన్నుపోటుగా భావించే బిల్లును వ్యతిరేకించినందుకు సభ నుంచి సస్పెండ్‌ చేయడంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా సస్పెండ్‌ అయిన ఎంపీలంతా పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. సస్పెండ్‌ అయిన ఎంపీలు, వారికి మద్దతుగా వెళ్లిన మరికొందరు ఎంపీలు అక్కడే రాత్రి నుంచి ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు.

రాత్రి అంతా అక్కడే బస చేసిన ఎంపీలు వారితో పాటు దుప్పట్లు, దిండ్లు, ఫ్యాన్లు, దోమల మందు ఇతర వస్తువులన్నీ తెచ్చుకున్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ తెలియజేసేలా దేశభక్తి గీతాలు ఆలపించారు. అన్నదాతలకు అనుకూలంగా నినాదాలు చేశారు.. డీఎంకే ఎంపీలు కనిమొళి, తిరుచ్చి శివ తమ నివాసాల నుంచి వచ్చి ఎంపీలకు వేడి వేడి ఇడ్లీలు తినిపించారు. అయితే రైతులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఓబ్రియన్‌ స్పష్టం చేశారు.

Tags

Next Story