State Election Commission: రాజకీయ నేతలు ఉపన్యాసాల్లో అవమానకర భాష మాట్లాడొద్దు

State Election Commission: రాజకీయ నేతలు ఉపన్యాసాల్లో అవమానకర భాష మాట్లాడొద్దు
ప్రసంగాల్లో నేతలు వాడే పదాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఎన్నికల ప్రచారాలు, రాజకీయ సమావేశాల్లో నాయకులు దివ్యాంగులమనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యక్తి తాలూకు లోపాన్ని ఎత్తిచూపే విధంగా మాట్లాడకూడదని, పక్షపాత ధోరణికి తావులేకుండా దివ్యాంగులకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పార్టీ తరుఫున ప్రచారం చేసే సామాజిక మాధ్యమాలు, ప్రెస్ నోట్ లు అన్నింటినీ అంతర్గతంగా సమీక్షించుకున్న తర్వాతే విడుదల చేయాలని నిర్దేశించింది. ఒకవేళ అతిక్రమిస్తే పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 లోని సెక్షన్ 92 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. పార్టీ కార్యకర్తలకు కూడా ఎలా మాట్లాడాలనే అంశంపై శిక్షణ ఇవ్వాలని, దివ్యాంగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నోడల్ అధికారిని నియమించాలని తెలిపింది. అలాగే.... అంతరాలు తొలిగించేలా దివ్యాంగులను పార్టీ సభ్యులుగా, ఎక్కువ మందిని చేర్చుకునేందుకు కృషి చేయాలని సూచించింది.

కొందరు రాజకీయ నాయకులు ఈ మధ్య హద్దులు మీరి ప్రసంగిస్తున్నారు. తమ ప్రసంగాల్లో ఆమోదయోగ్యంకాని పదాలు వాడుతున్నారు. ఈ ధోరణిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నాయకులకు కీలక సూచనలు చేసింది. రాజకీయ నాయకులు, ప్రతినిధులు బహిరంగ ప్రకటన లేదా ప్రసంగాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలను వాడకూడదని సూచించింది. మూగ, పాగల్‌, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు ఉపయోగించకూడదని హెచ్చరించింది. ఇలాంటి పదాలు ఉపయోగించి మాట్లాడడం అవమానకరమైన భాష అవుతుందని, దీని నివారణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల సంఘం కోరింది.

నాయకుల ఉపన్యాసాలు, ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్‌లు సహా అన్ని విధాల ప్రచారాల్లో దివ్యాంగుల పట్ల వివక్ష ప్రతిబింబించే పదాలు వాడొద్దని రాజకీయ పార్టీలను కోరింది. దీనిని అధిగమించేందుకు పార్టీలు అంతర్గతంగా సమీక్షించుకోవాలని సూచించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలను నిషేధించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు తమ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈసీ కోరింది. రాజకీయ నాయకులు తమ రచనలు, కథనాలు, ప్రచారం సహా ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడొద్దని స్పష్టత నిచ్చింది. దివ్యాంగుల వైకల్యాన్ని ప్రతిబింబించే పదాలు అభ్యంతరకరమైనవి, సమాజంలో పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story