Donald Trump: నన్ను గెలిపిస్తే పన్ను నుంచి విముక్తి .. ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రజలపై హామీల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న ఈ ఏన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో విస్తృతమైన సుంకాల విధానాన్ని (టారిఫ్‌ల పాలసీని) అమలు చేస్తానని ప్రకటించారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్‌లో గురువారం ఆయన అమెరికా పార్లమెంట్ సభ్యులతో జరిపిన సమావేశంలో ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదించినట్టు సీఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించింది. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు విదేశాంగ విధానంలో సుంకాలను బహుముఖ అస్త్రంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌పై విజయం సాధిస్తే మరింత రక్షణాత్మక ధోరణితో కూడిన వాణిజ్య ఎజెండాను అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు ఆయన తాజా ప్రతిపాదన స్పష్టం చేస్తున్నది. అయితే ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్‌లను తీసుకురావడమంటే దిగువ, మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com