Honey Trap: ఆన్‌లైన్‌లో ఫొటోలు పెట్టొద్దు, రీల్స్ చేయొద్దు..

భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులను హనీట్రాప్‌లోకి దించి.. దేశానికి సంబంధించిన సున్నితమైన డేటాను కాజేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో కేంద్ర పోలీసు బలగాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ భద్రతా బలగాల్లో పనిచేసే వారు యూనిఫామ్‌లలో, ఆఫీసులు, పని ప్రదేశాల్లో సరదాగా ఫోటోలు, దిగడం.. రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో ఉంచటం దేశానికే సమస్యగా మారింది. ఆ ఫోటోలు, వీడియోల ఆధారంగా వారికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మహిళలను ఎరగా వేసి దేశ రహస్యాలు, కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అంతే కాకుండా కీలకమైన, రహస్య ప్రాంతాల్లో దిగిన ఫొటోలను కూడా కొందరు షేర్ చేసేస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలు ఇటీవల ఓ పరిశీలన చేపట్టగా ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో నిఘా సంస్థలు కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు ఒక లేఖ రాశాయి. ఈ నోట్ అందుకున్న వెంటనే సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ.. తమ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. యూనిఫామ్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయొద్దని.. పరిచయం లేని వారితో ఆన్‌లైన్‌లో ఫ్రెండ్ షిప్, రిలేషన్‌షిప్‌ల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాల్లో రీల్స్ చేయొద్దని హెచ్చరించాయి.ఈ గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోఢా కూడా తమ బలగాలకు ఈమేరకు వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్, పాకిస్తాన్‌లోని మహిళా ఇంటెలిజెన్స్ అధికారితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఆమె వేసిన వలలో (హనీ ట్రాప్) ఆ కానిస్టేబుల్ చిక్కుకుని, కొంత కీలక సమాచారాన్ని అందజేశాడు. అలాగే అంతకు ముందు ఒక డిఆర్డీ వో సైంటిస్ట్ ఒక పాకిస్తాని మహిళతో కీలక సమాచారాన్ని పంచుకోవడం అంటే సంఘటనలో జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ విధంగా అధికారులు సూచనలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com