PM Modi : జీవితంలో ఏదీ సులువుగా ఉండదు.. విద్యార్థులకు ప్రధాని సలహాలు

సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార్చుకునే పరిస్థితికి వెళ్లొద్దని సూచించారు. ‘పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha)’ రెండో ఎడిషన్‌లో భాగంగా పలువురు విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు.
ఈ సందర్భంగా కెరీర్ పురోగతికి సంబంధించి వారికి విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు వెలిబుచ్చిన సందేహాలకు సమధానాలు ఇచ్చారు. క్రమశిక్షణ, ప్రేరణ ఈ రెండింటిలో ఏది ముఖ్యం..? అన్న ప్రశ్నకు.. ఆ రెండింటినీ పోల్చకూడదని అన్నారు. ఎంత స్ఫూర్తి పొందినా ఆచరణలో క్రమశిక్షణ లేకపోతే సత్ఫలితాలు పొందలేరని అన్నారు. సమయపాలన, స్థిరత్వం, స్వీయ క్రమశిక్షణే మన ప్రేరణను అర్థవంతమైన ఫలితాలుగా మారుస్తుందని చెప్పారు.
ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయాలు నిజమేనా..? అన్న ప్రశ్నకు సాంకేతికత మన పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఏఐకి విద్యార్థులు భయపడాల్సిన పనిలేదన్నారు. టెక్నాలజీతో ఎలా పనిచేయాలన్నది నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. జీవితంలో ఏదీ సులువుగా ఉండదన్నారు.
విద్యార్థులకు ఐదు ట్రావెల్ డెస్టినేషన్స్ చెప్పండి..? అని అడుగగా.. ముందు మన సొంత ప్రాంతాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. మన జిల్లా, నగరం, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాల జాబితాను రాసుకోవాలన్నారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో ఎంచుకోవాలని చెప్పారు. అనంతరం మన సమీపంలో ఉన్న ప్రాంతాల విశిష్టతను తెలుసుకుంటే, అది భవిష్యత్తులో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
మంచి నాయకుడిగా ఎలా మారాలి..? అన్న ప్రశ్నకు మన విధివిధానాలకు ఎన్నటికీ భయపడకూడదని చెప్పారు. విధేయత, నిబద్ధతతో పనిచేయాలన్నారు. నిలకడగా సరైన పని చేయడమే నిజమైన నాయకత్వమని చెప్పారు. లీడర్‌షిప్‌నకు ముఖ్యమైన లక్షణం మీ ఆలోచనలను కనీసం 10 మందికైనా స్పష్టంగా తెలియజేయగలడమని అన్నారు.
మెదడు ఆరోగ్యంగా పనిచేయాలంటే కంటినిండా నిద్రపోవాలని ప్రధాని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితాన్ని కూడా ఆస్వాదించాలని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంగా ఉండటం చాలా ముఖ్యమని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని ప్రధాని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
