Uttar Pradesh: డిప్రెషన్‌లో చెంపదెబ్బలు కొట్టే వ్యక్తి అరెస్ట్

తండ్రి మరణం, తల్లి ద్వితీయ వివాహంతో నైరాశ్యంలోకి జారుకున్న 23 ఏండ్ల యువకుడు అందులోనుంచి బయటపడేందుకు ఎంచుకున్న మార్గం అతడిని కటకటాలపాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నివసించే కపిల్ కుమార్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అపరిచితులను చెంపదెబ్బ కొట్టి సంతృప్తి పడేవాడు. ఓ మహిళను, ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారితోసహా పలువురిని చెంపదెబ్బ కొట్టినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ఐదారు నెలలుగా ఓ వ్యక్తి అపరిచితులను చెంపదెబ్బ కొడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి బయటపడేందుకే తాను స్కూటర్‌పై వెళుతూ అపరిచిత వ్యక్తులను చెంపదెబ్బ కొడుతున్నట్టు కపిల్ కుమార్ చెప్పినట్టు మీరట్(సిటీ) ఎస్‌పీ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు.
కపిల్ చేష్టలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగినట్టు ఆయన చెప్పారు. కపిల్ చేతిలో చెంపదెబ్బ తిన్న ఓ మహిళ స్థానిక రాజకీయ నాయకుడి బంధువు కావడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కపిల్ తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం కపిల్ సూరజ్‌కుండ్‌లో తన తల్లి, మారు తండ్రి వద్ద ఉంటున్నట్టు పోలీసులు చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, తాను చిన్నప్పటి నుంచి ఎన్ని మంచి పనులు చేసినా తనకు మంచి జరగడం లేదని అతను పోలీసులకు చెప్పాడు. చెడ్డ పనులు చేస్తే తనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే అపరిచిత వ్యక్తులను చెంపదెబ్బలు కొడుతున్నట్టు కపిల్ చెప్పాడని ఎస్‌పీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com