Double Murder: పాదాలను తాకి.. తుపాకీతో కాల్పులు..

దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. షహదారా ప్రాంతంలో తుపాకీ తూటాలకు ఇద్దరు బలయ్యారు. మరో మైనర్ గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి సంబరాల్లో ఉన్న ఓ కుటుంబంపై ఇద్దరు వ్యక్తులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 40 ఏళ్ల వ్యక్తి, ఆయన మేనల్లుడు చనిపోగా, పదేళ్ల ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీలోని షాదాలో గత రాత్రి జరిగిందీ ఘటన. కాల్పులు జరుపుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆకాశ్‌శర్మ రాత్రి 8 గంటల సమయంలో మేనల్లుడు రిషభ్‌శర్మ, కుమారుడు క్రిష్‌శర్మతో కలిసి ఇంటి బయట టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడికొచ్చారు. ఆకాశ్ పాదాలను తాకి నమస్కరించారు. ఆ వెంటనే ఆకాశ్ భయపడి ఇంట్లోకి పరిగెత్తడం, నిందితుల్లో ఒకడు తుపాకి తీసి కాల్పులు జరపడం క్షణాల్లో జరిగిపోయాయి.బాంబులు అంటించే ప్రయత్నంలో ఉన్న రిషభ్ తొలుత ఇదేమీ పట్టించుకోలేదు. తుపాకి పేలిన శబ్దం రావడంతో అప్పుడు గమనించి పారిపోతున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు అతడిపైనా కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రి తరలించగా ఆకాశ్, రిషభ్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. క్రిష్‌కు చికిత్స కొనసాగుతోంది.
నిందితులు తనకు తెలుసని, వారితో సంవత్సరాలుగా భూ తగాదా ఉందని ఆకాశ్ భార్య తెలిపారు. ఆకాశ్ సోదరుడు యోగేశ్ మాట్లాడుతూ నిందితులు గత నెలలో తమ ఇంటిపైనా కాల్పులు జరిపారని, అయితే పోలీసులు ఈ కేసులో తమనే తిరిగి ఇరికించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను పోలీసులు తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయడమే కాకుండా తామే గొడవలకు దిగుతున్నామని ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి ఐదు రౌండ్ల బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత శత్రుత్వంతోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com