SC: 498A... కేవలం వరకట్న సెక్షన్ మాత్రమే కాదు

SC: 498A... కేవలం వరకట్న సెక్షన్ మాత్రమే కాదు
X
ఈ సెక్షన్.. వరకట్నం కోసమే కాదన్న ధర్మాసనం

498A ప్రకారం చర్యలు తీసుకోవడానికి వరకట్నం వేధింపులే అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 498A ఉద్దేశం కేవలం వరకట్నం డిమాండ్ కారణంగా జరిగే వేధింపుల నుంచి రక్షించేందుకు మాత్రమే కాదని తెలిపింది. ఓ వ్యక్తిపై తన భార్య కేసు నమోదు చేయగా ఆమెను కట్నం కోసం వేధించలేదని పేర్కొంటూ నిందితుడు AP హైకోర్టును ఆశ్రయించగా ఊరటనిచ్చింది. బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. భర్త, అత్తింటివారి నుంచి వివాహితలకు రక్షణ ఛత్రంగా తీసుకువచ్చిన ఐపీసీ ‘సెక్షన్‌ 498’లో అన్ని రకాల వేధింపులను ఇమిడ్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తలపై క్రూరత్వ అభియోగాలు మోపడానికి ‘వరకట్నం డిమాండ్‌’ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద వరకట్నం డిమాండ్‌ చేయడాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్‌ 498ఏలోనే క్రూరత్వ చర్యలు ఇమిడి ఉన్నాయని, భర్త, అత్తమామలపై ఈ సెక్షన్‌ను అమలు చేయడానికి అదనంగా వరకట్నం డిమాండ్‌ను జోడించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

సుప్రీం కీలక వ్యాఖ్యలు

భార్యలపై జరిగే క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది 498 సెక్షన్‌ కింద శిక్షార్హమైందేనని పేర్కొంది. సెక్షన్‌ 498ఏ, బీ క్లాజులలో అంశాలు ఎలాంటి వేధింపులకైనా వర్తిస్తాయని స్పష్టం చేసింది. క్లాజ్‌-ఏ ప్రకారం.. భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడం, క్లాజ్‌-బీ ప్రకారం.. భార్య లేదా ఆమె పుట్టింటి వారి నుంచి చట్టవిరుద్ధమైన డిమాండ్‌ను(అదనపు కట్నం, కానుకలు వంటివి) బలవంతంగా నెరవేర్చుకునేందుకు చేసే వేధింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 498ను ప్రవేశ పెట్టిన సందర్భంగా పార్లమెంటులో చేసిన ప్రకటనను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

Tags

Next Story