Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా .. డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!

Shaheen: ప్రొఫెసర్ నుంచి ఉగ్రవాదిగా .. డాక్టర్ షాహీన్ బ్యాగ్రౌండ్ ఇదే!
X
లక్నోకు చెందిన మాజీ ప్రొఫెసర్ షాహీన్ అరెస్ట్

దేశంలో భారీ ఉగ్ర కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదించాయి. టెర్రర్ మాడ్యూల్ కేసులో పలువురు డాక్టర్లను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో లక్నోకు చెందిన మాజీ వైద్య కళాశాల మహిళా లెక్చరర్ ఉండడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈమె జైష్-ఎ-మొహమ్మద్ తరపున భారత విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా గుర్తించారు.

షాహీన్ షాహిద్.. లక్నోలో వైద్య కాళాశాల లెక్చరర్‌గా పని చేసింది. మంచి కెరీర్‌తో వైద్య వృత్తిలో కొనసాగింది. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఆమె ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైంది. గత వారం ఉగ్ర కుట్ర బయటపడింది. ఇందులో భాగంగా గతవారం ఫరీదాబాద్‌లో షాహీన్ షాహిద్ అరెస్టైంది. జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా కనిపెట్టారు. ఈమె భారతదేశంలో జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని స్థాపించి.. నాయకత్వం వహిస్తున్నట్లుగా గుర్తించారు. భారతదేశంలో మహిళల నేతృత్వంలో ఒక నెట్‌వర్క్ కొనసాగించాలని డాక్టర్ షాహీన్ ప్లాన్ చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పాకిస్థాన్‌లో మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్న జేఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు మంచి సంబంధాలు ఉండడంతో.. భారత్‌లో ఈ కీలక బాధ్యతలు అప్పగించి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సాదియా భర్త యూసుఫ్ అజార్ 1999 కాందహార్ హైజాక్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల్లో ఒకడు. బహవల్‌పూర్‌లో ఆపరేషన్ సిందూర్ సమయంలో హతమయ్యాడు.

షాహీన్ నిత్యం.. జేఎం నేతలతో రహస్య సంప్రదింపులు జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. జేఎంకు మద్దతుగా భారతదేశంలో సానుభూతిపరులను సమీకరించడం కోసం సోషల్ మీడియా ద్వారా రహస్య కార్యకలాపాలు జరిపినట్లుగా కనిపెట్టారు.

టెర్రర్ మాడ్యూల్‌ ఇలా బయటపడింది..

ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ యు నబీలను అదుపులోకి తీసుకున్న తర్వాత డాక్టర్ షాహీన్ అరెస్టు జరిగింది. నవంబర్ 8న ఫరీదాబాద్‌లో ముజమ్మిల్‌ను అరెస్టు చేయడంతో వరుస అరెస్టులు జరిగాయి. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, AK-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ముజమ్మిల్ విచారణలో షాహీన్ ప్రమేయం, జేఎం మహిళా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నవంబర్ 11న డాక్టర్ షాహీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె పని చేసిన సంస్థల్లో విచారణ జరపగా అనుమానాలు నిజమయ్యాయి. షాహీన్‌ సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీ కూడా వైద్యుడే. కుటుంబానికి చెందిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్, అనేక పత్రాలను ఏటీఎస్ స్వాధీనం చేసుకున్నారు. ఇక షాహీన్ అరెస్ట్‌పై తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తనకు తెలియదని అన్నారు.

షాహీన్… కెరీర్.. అదృశ్యం

కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజ్ (GSVM) నుంచి పొందిన రికార్డుల ప్రకారం.. డాక్టర్ షాహీన్ ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) ద్వారా ఎంపికైన తర్వాత 2006లో ఆ సంస్థలో చేరింది. 2009-2010 మధ్య కన్నౌజ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో కొంతకాలం పనిచేసింది. 2013లో అనధికార సెలవుపై వెళ్లి తిరిగి రాలేదని కళాశాల అధికారులు ధృవీకరించారు. అనేక నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆమె స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను 2021 లో ఉద్యోగం నుంచి తొలగించింది. డాక్టర్ షాహీన్ మహారాష్ట్రకు చెందిన జాఫర్ హయత్ అనే ప్రొఫెషనల్‌ను వివాహం చేసుకుంది. 2015లో జంట విడాకులు తీసుకున్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. విడిపోయిన తర్వాత షాహీన్.. ఫరీదాబాద్‌కు వెళ్లిందని.. అక్కడ డాక్టర్ ముజమ్మిల్, ఇతర సభ్యులతో పరిచయం ఏర్పడినట్లుగా దర్యా్ప్తులో తేలింది. ఇక డాక్టర్ ముజమ్మిల్ తరచుగా ఉపయోగించే కారులో గతంలో రైఫిల్, లైవ్ కార్ట్రిడ్జ్‌లు ఉన్నట్లు కనుగొనబడిందని, నెట్‌వర్క్ లాజిస్టిక్స్‌లో ఆమె చురుకైన ప్రమేయం ఉందనే అనుమానాలు బలపరుస్తుందని దర్యాప్తుకు దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story