Coaching Centers: మోసపూరిత ప్రకటనలకు కళ్ళెం

Coaching Centers:  మోసపూరిత ప్రకటనలకు కళ్ళెం
ప్రజాభిప్రాయాలకోసం మార్గదర్శకాలు బహిర్గతం

విద్యార్థులను ఆకర్షించడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనలను అడ్డుకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది. ఈ మార్గదర్శకాల ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల ప్రాదికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. విద్యార్థుల ప్రతిభా పాటవాలను గుర్తించకుండా కోచింగ్ సెంటర్ గొప్పతనంగా చెప్పడాన్ని తప్పుబట్టిన కేంద్రం 100శాతం జాబ్ గ్యారంటీలు, ఎంపికలు వంటి అబద్ధపు ప్రకటనలు చేయకూడదని హెచ్చరించింది.

కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు:

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులను చేర్చుకోకూడదు. అదనపు కోచింగ్‌ తీసుకునే ముందు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్‌ కచ్చితంగా పూర్తి చేయాలి.

కోచింగ్ సెంటర్లు సూచించిన డాక్యుమెంటేషన్ అవసరాలకు కట్టుబడి, స్థానిక అధికార పరిధిలోని అధికారులతో రిజిస్టర్‌ చేసుకోవాలి. కోచింగ్ సెంటర్‌ ప్రతి బ్రాంచ్‌ను ఒక ప్రత్యేక సంస్థగా పరిగణిస్తారు, అన్నింటికీ ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్ అవసరం. కోచింగ్ సెంటర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలతో పాటు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.25,000 పెనాల్టీ నుంచి రిజిస్ట్రేషన్ రద్దు కూడా చేయవచ్చు. అకడమిక్‌ పర్ఫార్మెన్స్‌కి సంబంధించి తప్పుదారి పట్టించే వాగ్దానాలు చేయకూడదు. పారదర్శకత, జవాబుదారితనం పాటించాలి. పారదర్శకతను ప్రోత్సహించడానికి, కోచింగ్ సెంటర్‌లు ట్యూటర్‌లు, కోర్సులు, పాఠ్యాంశాలు, సౌకర్యాలు, ఇతర సంబంధిత వివరాలను తెలియజేసే వెబ్‌సైట్‌లను నిర్వహించడం అవసరం.

విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి, కోచింగ్ సెంటర్లు విద్యార్థికి కనీస స్థల అవసరాలను తీర్చాలి. అగ్నిమాపక భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. తగినంత వెలుతురు, వెంటిలేషన్, ఎలక్ట్రిఫికేషన్‌ మెయింటైన్‌ చేయాలి. CCTV కెమెరాల ఏర్పాటు, వైద్య సహాయం, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.మార్గదర్శకాల ప్రకారం, కోచింగ్ సెంటర్లలో సహేతుకమైన ట్యూషన్ ఫీజులు ఉండాలి. స్టూడెంట్స్‌కు ఫీజు రిసీప్ట్‌లు అందించాలి. కోర్సులు, ఫీజు రీఫండ్ విధానాలు, ఇతర సంబంధిత వివరాల గురించి సమగ్ర సమాచారాన్ని కోచింగ్ సెంటర్లు అందించాలి.

కోచింగ్ తరగతులు పాఠశాల సమయాల్లో ఉండకూడదు. విద్యార్థులకు పాఠశాల, ఇటు కోచింగ్‌ బ్యాలెన్స్‌ చేసుకునే వెసులుబాటు ఉండాలి. విద్యార్థులు, ట్యూటర్లు ఇద్దరికీ వీక్లీ ఆఫ్‌లు తప్పనిసరి. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు ఉండాలి. నిర్ణీత గడువులోపు ప్రో-రేటా రీఫండ్‌తో కోర్సుల నుంచి ఉపసంహరించుకునే వెసులుబాటును విద్యార్థులకు కల్పించారు. కోర్సు వ్యవధిలో ఎలాంటి ఫీజులను పెంచకూడదు.

కంప్లైంట్‌ మెకానిజం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు కోచింగ్ సెంటర్‌లపై ఫిర్యాదులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.

Tags

Next Story