Draupadi Murmu : రాష్ట్రపతిగా తొలి ఆదివాసీ.. ద్రౌపది ముర్ము..

Draupadi Murmu : రాష్ట్రపతిగా తొలి ఆదివాసీ.. ద్రౌపది ముర్ము..
Draupadi Murmu : ద్రౌపది ముర్ము...రాష్ట్రపతి పదవికి ఎంపికైన తొలి ఆదివాసీగా రికార్డులకెక్కనున్నారు.

Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్ము...రాష్ట్రపతి పదవికి ఎంపికైన తొలి ఆదివాసీగా రికార్డులకెక్కనున్నారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన ఒడిశాలో పంచాయతీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన ముర్ము...అనతికాలంలోనే అత్యున్నత శిఖరాలకు ఎదిగారు. ఐతే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదురుకుని రాజకీయంగా రాణించారు.

ఒడిశాకు చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము...రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీగా చరిత్రకెక్కారు. ద్రౌపది ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసిలో జర్మించారు. ఆమె తండ్రి, తాత ఇద్దరు గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.

సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది..గ్రాడ్యుయేషన్‌లో బీఏ చేశారు. ఆ తరువాత టీచర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సెక్రటేరియట్‌లో క్లరికల్ పోస్టులోనూ, నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గానూ పనిచేశారు.

ఆ తర్వాత 1994 నుంచి 1997 వరకు శ్రీఅరబిందో ఇంటెగ్రల్ సంస్థలో టీచర్‌గా పనిచేశారు. బ్యాంక్‌ మేనేజర్‌గా ఉన్న శ్యామ్ చరణ్ ముర్మును పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ద్రౌపది పేరుకు ముర్ము వచ్చి చేరింది. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఇతిశ్రీ జన్మించారు.

దురదృష్టవశాత్తూ 2009, 2013లో ఇద్దరు కుమారులనూ కోల్పోయారు ముర్ము. ఆ మరుసటి ఏడాదే 2014లో భర్త శ్యామ్ చరణ్ ముర్మును కూడా పోగొట్టుకున్నారు.

1997లో బీజేపీలో చేరిన ముర్ము..రాయ్‌రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్‌రంగాపూర్‌ నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. బీజేపీ గిరిజన తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.

రాయరంగాపూర్‌ అసెంబ్లీ నుంచి 2000 సంవత్సరంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బిజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుంచి 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖ మంత్రిగా...2002-2004 మధ్య మత్స్య, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేశారు.

2004లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నికంఠ పురస్కారం అందుకున్నారు ముర్ము. ఓవైపు మంత్రిగా ఉంటూనే పార్టీ 2002 నుంచి 2009 వరకు మయూర్‌భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, 2010 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా, ఆ తరువాత బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా పలు పదవులు స్వీకరించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో ద్రౌపది ముర్మును గవర్నర్‌గా పంపించారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి 2015 నుంచి 2021 వరకు గవర్నర్‌గా సేవలందించారు ముర్ము.

జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్మునే. ఒడిశా రాష్ట్రం నుంచి గవర్నర్‌గా నియమితులైన మొదటి మహిళ, ఏ రాష్ట్రం నుంచి చూసుకున్నా..గవర్నర్ బాధ్యతలు చేపట్టిన మొదటి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్న మొట్టమొదటి గిరిజన మహిళగా రికార్డ్‌ సృష్టించబోతున్నారు ద్రౌపది ముర్ము.

Tags

Read MoreRead Less
Next Story