Draupadi Murmu: మోదీ, అమిత్ షాలతో ద్రౌపది ముర్ము భేటీ.. నామినేషన్ సందర్భంగా..

Draupadi Murmu: ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. రేపు నామినేషన్ వేయనున్న నేపథ్యంలో మర్యాదపూర్తకంగా కలిశారు. ఆమెకు ప్రధాని మోదీ, అమిత్ షా దుశ్శాలువాతో సత్కరించారు. కాసేపు ద్రౌపది ముర్ముతో చర్చించారు. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్నారు ద్రౌపది ముర్ము. 27వ తేదీన విపక్ష కూటమి తరపున యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేస్తారు. మరోవైపు ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
బీజేడీకి 2.85 శాతం ఓట్లు ఉండడంతో.. విజయానికి 1.2 శాతం ఓట్ల దూరంలో ఉన్న ఎన్డీయేకు మెజారిటీ వచ్చినట్టైంది. అటు బీహార్ సీఎం నితీష్ కుమార్, సిక్కిం సీఎం ప్రేమ్‌చంద్ సైతం బహిరంగ మద్దతు తెలిపారు. ఏపీలో వైసీపీ, తమిళనాడులో అన్నాడీఎంకే సైతం ద్రౌపది ముర్ముకే ఓటు వేస్తుండడంతో.. ఈ మద్దతుతో ఈజీగా గెలుస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీయేకు ఉన్న బలంతో పాటు బీజేడీ, వైసీపీ గనక ఓటు వేస్తే తమ కూటమి అభ్యర్థి అవలీలగా గెలుస్తారని మొదటి నుంచి వ్యూహం పన్నింది బీజేపీ దానికి తగ్గట్టే రెండు వారాల క్రితం ప్రధాని మోదీనే స్వయంగా సీఎం నవీన్ పట్నాయక్, జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడారు.
ద్రౌపది ముర్ము పేరు ప్రకటనతో.. తటస్థంగా ఉన్నవాళ్లు, కొందరు విపక్ష నేతలు సైతం ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికే ఓటు వేస్తున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి గిరిజన మహిళ కావడంతో.. యూపీఏ కూటమిలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా ద్రౌపదికే మద్దతిచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్ ముక్తి మోర్చ పునరాలోచనలో పడింది. ఎన్‌డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపే యోచనలో జేఎంఎం ఉంది. ఇప్పటికే విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపిన జేఎంఎం.. ఇప్పుడు ముర్ముకు మద్దతుగా నిలవాలని యోచిస్తోంది.
విపక్షంలో కీలకంగా ఉన్న జేడీఎస్ అధినేత దేవెగౌడ సైతం ద్రౌపది ముర్ము సమర్థురాలైన అభ్యర్థి అని కామెంట్ చేశారు. దీంతో ఎన్డీయే ఊహించిన దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ద్రౌపది ముర్ము గెలిచేందుకు కావాల్సినన్నటి ఓట్లు ఉన్నప్పటికీ.. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలోని బృందం ద్రౌపది ముర్ము తరపున దేశవ్యాప్తంగా పర్యటించి, మద్దతు కూడగట్టనున్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము కూడా స్వయంగా రాష్ట్రాల్లో పర్యటించి, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి మద్దతు కోరనున్నారు.
27న నామినేషన్ దాఖలు చేయనున్న యశ్వంత్‌సిన్హా.. బిహార్, జార్ఖండ్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. యశ్వంత్ సిన్హాను బలపరుస్తూ.. నామినేషన్ పత్రాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతకాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క సంతకాలు చేశారు. ప్రతి అభ్యర్థి నామినేషన్‌పైనా.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టొరల్ కాలేజీలోని కనీసం 50 మంది ఓటర్లు ప్రతిపాదకులుగా సంతకాలు చేయాలి. మరో 50 మంది సమర్థించాల్సి ఉంటుంది. అయితే తొలి ప్రతిపాదకుడిగా నామినేషన్లపై ప్రధానే సంతకం చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com