Ahmedabad: ప్రియుడితో కలిసి భర్తను చంపి, వంటింటిలో పూడ్చిపెట్టిన భార్య..

వెంకటేష్ నటించిన సూపర్ హిట్ ఫిలిం ‘‘దృశ్యం’’ తరహాలో ఒక మర్డర్ జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ తన భర్తను చంపేసి, వంటింటిలో పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడు, అతడి స్నేహితుడి సహాయంతో భర్తను చంపేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఇంటిలోని వంటగదిలో నేల కింద పూడ్చిపెట్టింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్న తర్వాత అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఘటనా స్థలం నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.
పోలీసులు నివేదిక ప్రకారం, సర్ఖేజ్ ప్రాంతంలోని ఫతేవాడి కెనాల్ నివాసి అయిన 35 ఏళ్ల సమీర్ అన్సారీ ఒక సంవత్సరం నుండి కనిపించకుండా పోయాడు. అతని భార్య రూబీ, ఆమె ప్రియుడు ఇమ్రాన్, ఇద్దరు స్నేహితులు సాహిల్, ఫైజు సహాయంతో సమీర్ హత్యకు కుట్ర పన్నింది. ఇమ్రాన్‌తో రూబీకి ఉన్న సంబంధం గురించి తెలిసిన సమీర్ తరుచూ ఆమెతో గొడవపడేవాడు. అది చివరకు హత్యకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. సమీర్ మిస్సింగ్‌పై మూడు నెలల క్రితం క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. అతడి మొబైల్ ఫోన్ 14 నెలలుగా స్విచ్ ఆఫ్ అయి ఉంది. అతను స్నేహితులతో, బంధువులతో మాట్లాడలేదు.
విచారణ జరపగా, ఇమ్రాన్‌తో అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో పోలీసులకు లీడ్ దొరికింది. విచారణలో ఇమ్రాన్, రూబీతో కలిసి సమీర్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. వంటింటి నుంచి సేకరించిన అస్థిపంజర అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. తన భర్త పని కోసం దుబాయ్ వెళ్లాడని చెప్పేదని, ఇమ్రాన్‌తో తరుచుగా కనిపించేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. హత్య తర్వాత కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్న రూబీ, ఆ తర్వాత ఇంటిని వేరే వారికి అద్దెకిచ్చింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అద్దెకు ఉన్న వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్లారు. ఇది పోలీసులు విచారణకు సహకరించింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రూబీ, సాహిల్,ఫైజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

