Droupadi Murmu: రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...

Droupadi Murmu: రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
X
అంబాలా ఎయిర్‌బేస్‌లో గగన విహారం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. హర్యానాలోని అంబాలా వాయుసేన స్థావరం నుంచి ఆమె ఈ ప్రత్యేక సార్టీలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో కీలక పాత్ర పోషించిన రఫేల్ జెట్‌లో రాష్ట్రపతి ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత వాయుసేన (IAF)కు చెందిన యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించడం ఇది రెండోసారి.

ఈ సార్టీకి ముందు రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ యూనిఫాం, హెల్మెట్ ధరించి విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఆమె అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పి. సింగ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉన్న ద్రౌపది ముర్ము, గతంలో 2023 ఏప్రిల్ 8న అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఈ ఘనత సాధించిన మూడో రాష్ట్రపతిగా, రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఇంతకుముందు మాజీ రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం (2006), ప్రతిభా పాటిల్ (2009) కూడా సుఖోయ్-30 విమానాల్లో ప్రయాణించారు.

ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను 2020 సెప్టెంబర్‌లో అంబాలా వైమానిక స్థావరంలో అధికారికంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. 2020 జులైలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన తొలి ఐదు విమానాలను 17వ స్క్వాడ్రన్ 'గోల్డెన్ యారోస్'లో చేర్చారు. సుమారు 22 ఏళ్ల తర్వాత భారత వాయుసేనలోకి దిగుమతి చేసుకున్న తొలి యుద్ధ విమానం రఫేల్ కావడం విశేషం.

Tags

Next Story