Goa : పబ్బులో తాగి తలతిక్క పని చేసిన డీఐజీ లాగి ఒక్కటిచ్చిన మహిళ

ప్రజలను రక్షించే వాళ్లే పోలీసులు. సామాన్యులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పట్టించుకోని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ కొంతమంది పోలీసులు చేసే పనులు మొత్తం డిపార్ట్‌మెంట్‌కే మాయని మచ్చ తెస్తున్న సంఘటనలు అక్కడో ఇక్కడో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే గోవాలో జరిగింది.
మహిళలను వేధించే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు ఉన్నతాధికారి అసభ్యంగా ప్రవర్తించాడు. అనారోగ్యం అని చెప్పి డ్యూటీకి సెలవులు పెట్టి పబ్‌కు వెళ్లిన ఆ ప్రబుద్ధుడు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి చంప దెబ్బలు తిన్నాడు.
వివరాల్లోకి వెళితే... గోవాకు చెందిన డీఐజీ ఎ కోన్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఉన్నతాధికారులకు చెప్పి లీవ్ తీసుకున్నాడు. గోవాలోని బగా అనే పట్టణంలో ఉన్న ఓ పబ్‌కు వెళ్లాడు. అక్కడ బాగా మద్యం తాగాడు. అనంతరం ఆ పబ్‌కు వచ్చిన ఓ మహిళతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడు. ముందు ఆ మహిళ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను పదే పదే అలాగే అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో విసుగొచ్చి మద్యం మత్తులో ఉన్న ఎ కోన్ చెంప చెళ్లుమనిపించింది.
ప్రస్తుతం ఈ డీఐజీ పబ్‌లో ఉన్నప్పటి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చేతిలో లిక్కర్ బాటిల్, తలపై కేప్ తో డీఐజీ ఎ కోన్.. తూలుతూ ఉండగా.. మరో వ్యక్తి పట్టుకుని ఉన్నాడు. ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీఐజీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. వైరల్ అయిన ఈ ఘటన గోవా అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళపై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన ఘటనపై శాసనసభలో గందరగోళం నెలకొంది. డీఐజీపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సావంత్ హామీ ఇచ్చారు. డీఐజీ ఎ కోన్‌ను వెంటనే డీఐజీని విధుల నుంచి తొలగించాలని పలువురు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 2009 కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన డీఐజీ గోవాలో పనిచేయక ముందు ఎ కోన్ ఢిల్లీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com