EAM Jaishankar : నా దృష్టిలో గొప్ప దౌత్యవేత్తలు వారే : జైశంకర్

భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు, పాలనాపరమైన విధానాలు, రాజకీయాల గురించి విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పుణెలోని పుస్తక మహోత్సవంలో మాట్లాడారు. దౌత్యవేత్తల విధుల గురించి మాట్లాడుతూ.. తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని పేర్కొన్నారు. భారత్‌కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజ్య నిర్వహణ తెలియవని అనేకమంది విదేశీ రచయితలు పుస్తకాలలో రాసిన వ్యాఖ్యలను పదేపదే చదివి విసిగిపోయానని అన్నారు.
మనమంతా సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పాటిస్తూ పెరిగామని జై శంకర్ చెప్పారు. ఇవన్నీ విదేశీయులకు తెలియవు కాబట్టి.. ఎన్నో ఏళ్లుగా భారత్ పాటిస్తున్న రాజనీతిని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. రామాయణంలోని ప్రజాపాలన, సంక్లిష్ట పరిస్థితులు, రాజకీయ వ్యూహాలు మన పరిపాలనా విధానాలను తెలియజేస్తాయన్నారు. ఆ సమయంలో హనుమంతుడు దౌత్యవేత్తగా తన విధులను ఎంతో చక్కగా నిర్వహించాడని చెప్పారు.
సీతకు సంబంధించిన సమాచారం తీసుకురమ్మని ఒక్క పనిమీద లంకకు పంపితే.. అక్కడికి వెళ్లిన హనుమంతుడు పది పనులు చేసుకువచ్చాడని, సీతలో మనోధైర్యాన్ని, రావణుడిలో భయాన్ని నింపాడని జైశంకర్ అన్నారు. అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా కౌరవులు, పాండవుల మధ్య సంధి కోసం ప్రయత్నించాడని, యుద్ధంలో ధర్మంవైపు నిలబడ్డాడని చెప్పారు. అంతకంటే గొప్ప దౌత్యవేత్తలను మనం ఇంకెక్కడ చూడగలమని ప్రశ్నించారు. వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నానని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

