Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు, రిక్టర్ స్కేల్‌పై 4.4

ఉత్తర భారత వాసులను భూకంపం వణికించింది. దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9.4 గంటల ప్రాంతంలో ప్రకంపనలు జరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైంది. నిమిషం పాటు భూమి కంపించింది. హర్యానా రోహతక్ దగ్గర భూకంప కేంద్రం గుర్తించారు. గురుగ్రామ్‌లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియలేదు.
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రకంపలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు ఊగిపోవడంతో నివాసితులు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. నోయిడా, గురుగ్రామ్‌లోని కార్యాలయాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కంప్యూటర్లు కదిలాయి. ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి బయటకు వచ్చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, షామ్లీ వరకు ప్రకంపనలు సంభవించాయి. ఝజ్జర్‌లోని భూకంప కేంద్రం నుంచి 200 కి.మీ దూరం వరకు సంభవించింది.
మరోవైపు ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మోకాలి లోతు నీటితో రహదారులు నిండిపోయాయి. ఇక విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక గురు, శుక్రవారాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ ఉండగా ప్రస్తుతం దాన్ని ఐఎండీ రెడ్ అలర్ట్‌గా ఐఎండీ మార్చింది. నిన్నటి నుంచి ఏకధాటిగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. నజాఫ్‌గఢ్‌లో 60 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది. నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్‌పత్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక గురుగ్రామ్‌లో అయితే చాలా అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు ప్రవేశించాయి. ఈ మేరకు బాధితులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com