Earthquake: లెహ్, లడఖ్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం

లెహ్, లడఖ్ ప్రాంత ప్రజలు మంగళవారం తెల్లవారుజామున భూకంపంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది. కాగా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతున్న భూప్రకంపనలు ఆందోళనలు కలిగిస్తున్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కిష్టావర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.
మంగళవారం తెల్లవారుజామున 1.10 గంటలకు సంభవించిన భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కిష్టావర్, లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో ఒకేరోజు భూకంపాలు సంభవించాయి. సంభవించిన భూకంపంతో లేహ్, లడాఖ్ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయట రోడ్లపైకి పరుగులు తీశారు. కొత్త సంవత్సర వేడుకల కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో లేహ్, లడాఖ్ ప్రాంతాలకు తరలివచ్చారు. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com