EC: ఎన్నికల ఖర్చు రేట్ కార్డ్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

EC: ఎన్నికల ఖర్చు రేట్ కార్డ్ విడుదల చేసిన  ఎన్నికల కమిషన్
పంజాబ్‌లోని జలంధర్‌లో కప్పు ఛాయ్‌కు 15 రూపాయలు కాగా మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో 7 రూపాయలే

అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిశీలనా ప్రక్రియలో భాగంగా అల్పాహారాలు, భోజనాలు, ఇతర ఎన్నికల ఖర్చులకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు రేట్లను నిర్ణయించారు. ఛాయ్‌కి ఎంత, సమోసాకు ఎంత అనే ధరలను ఫిక్స్‌ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో కప్పు ఛాయ్‌కు 15 రూపాయలుగా నిర్దేశిస్తే.. మధ్యప్రదేశ్‌లోని మాండ్లలో అది 7 రూపాయలుగా ఉంది.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు వేళ.. ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయి ప్రచారం కోసం అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, బహిరంగ సభలకు వచ్చే ప్రజలు తినే చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనాల కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించాలో జిల్లాల ఎన్నికల అధికారులు పార్టీలు, అభ్యర్థులకు నిర్దేశిస్తున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఛాయ్‌కి 15, సమోసాకు 15రూపాయలుగా ధర నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌ మండ్లాలో టీకి 7, సమోసకు ఏడున్నర రూపాయలుగా ధరను ఫిక్స్‌ చేశారు. కేజీ మటన్‌కు 500, చికెన్‌కు 250, లస్సీకి 20, నిమ్మరసానికి 15 రూపాయలుగా ధర నిర్ణయించారు. బాలాఘాట్‌లో రేట్‌కార్డులో టీకి 5, సమోసాకు 10, ఇడ్లీ, వడ, పోహ వంటివాటికి 20, దోసా, ఉప్మాలకు 30 రూపాయలుగా ధరను నిర్ణయించారు.

హింసాత్మక మణిపుర్‌లోని తౌబాల్‌ జిల్లాలో ఛాయ్‌, సమోసా, కచోరి, కర్జూరా వంటి వాటన్నిటికి ఒక్కో దానికి 10 రూపాయలే ఖర్చు చేయాల్సి ఉంది. టెంగ్‌నౌపాల్‌ జిల్లాలోబ్లాక్‌ టీకి 5, ఛాయ్‌కు 10రూపాయలు చెల్లించాలి. ఇక్కడ రేట్‌కార్డులో కేజీ బాతు మాంసం 300, పంది మాంసానికి 400 రూపాయలు వెచ్చించాలి. చెన్నైలో టీకి 15, కాఫీకి 20, చికెన్‌ బిర్యానికి 150గా ధరను ఫిక్స్‌ చేశారు. నోయిడాలో శాకాహార భోజనానికి 100, సాండ్‌విచ్‌కు 25, కేజీ జిలేబీకి 90 రూపాయలుగా నిర్ణయించారు. గోవాలో.. బటాటా వడకు 15, సమోసాకు 15, కాఫీకి 20రూపాయలు చెల్లించాలి. హరియాణాలోని జింద్‌లో తందూర్‌కు 300, దాల్‌మక్నీ, మిక్స్‌వెజ్‌లకు 130, మటర్‌పనీర్‌కు 160రూపాయలుగా ధర నిర్దేశించారు.

ప్రచారంలో అభ్యర్థులు ముఖ్యంగా పంపిణీ చేసేది మద్యం. అయితే రేట్‌ కార్డులలో ఏ చోట కూడా మద్యం రేట్లను ప్రస్తావించలేదు. పూలదండలు, పుష్పగుచ్ఛాలు, టోపీలు, ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాలు, ఫ్లెక్సీలకు ఎంత చెల్లించాలో కూడా రేట్‌ కార్డులలో నిర్ణయించారు. సభల ఏర్పాటు కోసం స్థలాలు, ర్యాలీల కోసం వాడే వాహనాలు, కూలర్లు, ఫామ్‌హౌస్‌లు, సోఫా వంటి వస్తువుల అద్దెల ధరల పరిమితిని కూడా వెల్లడించారు.

ECI జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం కోసం గరిష్ఠంగా అనుమతించిన వ్యయమనేది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మారుతూ ఉంటుంది. అభ్యర్థి నామినేటైన తేదీ నుంచి ఫలితాన్ని ప్రకటించే తేదీ వరకు ఖర్చు వివరాలను.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ సహా చాలారాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి.. గరిష్ఠంగా 95 లక్షలు ఖర్చు చేయవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఆ మొత్తం 75 లక్షలుగా ఉంది. అంతకంటే మించి ఖర్చు చేస్తే ఈసీ చర్యలు తీసుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story